ఎవర్ గ్రీన్ గాంధీయిజం.. ఎన్ని కష్టాలొచ్చినా జీవితాంతం నిజాల కోసం వెతికిండు...

ఎవర్ గ్రీన్ గాంధీయిజం.. ఎన్ని కష్టాలొచ్చినా జీవితాంతం నిజాల కోసం వెతికిండు...

ప్రపంచంలో గాంధీజీ విగ్రహం లేని దేశం లేదు. 'నా జీవితమే ఒక సందేశం' అన్న మాట చాలు ఆయన విశ్వ మానవుడని చెప్పడానికి. ఆ మాట చెప్పడానికి ఒక వ్యక్తికి ఎంత ధైర్యం, సాహసం కావాలో కదా..! ఎన్ని కష్టాలొచ్చినా జీవితాంతం నిజాల కోసం వెతికిండు. గాంధీని పొగడడం తేలిక. కానీ, ఆయన్ను అనుసరించడం కత్తిమీద సాము లాంటిది. అందుకే గాంధీయిజం ఎవర్స్!

 గాంధీజీ మనసులో కొన్ని విలువలు ఉండేవి. ఏ విలువల్ని, ఏ సిద్ధాంతాల్ని ఆయన నమ్మేవాడో... వాటిని ఖచ్చితంగా ఆచరించేవాడు. ఇతరులకు ఏదైనా ఉపదేశించాలంటే ముందు దాన్ని ఆయన  సాధన చేసేవాడు. 'చక్కెర తింటే ఆరోగ్యానికి మంచిది కాదు" అని ఒక పిల్లవాడికి చెప్పడానికి.. అంతకు రెండు వారాల ముందే ఆయన చక్కెర తినడం మానేశాడు. ఇలా ఏ పని చేసినా సాధన చేశాకే.. ఇతరులకు చెప్పేవారు. ఒక మనిషి తన విలువలకు కట్టుబడి జీవించాలనుకున్నప్పుడు.. కాలం, ప్రదేశం, పరిస్థితులు ఆ విలువలకు పరీక్షలు పెడుతుంటాయి. ఆ పరీక్షల్లో నెగ్గలేకే.. నమ్మిన విలువల్ని మధ్యలో వదిలేస్తుంటారు. కానీ, శాశ్వతమైన విలువల్ని, నిజాలని కనుగొని, వాటిని ఆచరణలో పెట్టినప్పుడు ఏదీ తన మార్గాన్ని అడ్డుకోలేదు. మహాత్మునిది ఆ మార్గమే!

గాంధీజీ సిద్ధాంతాలు :
సింపుల్గా జీవించడం గాంధీజీ మొదటి సిద్ధాంతం. 'ప్రకృతి మన అవసరాలను తీరుస్తుంది కానీ, కోరికలను కాదు' అనేవారు గాంధీజీ. నిరాడంబరంగా బతకడానికి.. కావాల్సిన ప్రతి ఒక్కటి ప్రకృతి మనకు ఇస్తోంది. కానీ, అవసరానికి మించి కోరుకోవడమే దుఃఖానికి కారణం. ప్రతి జీవి పట్ల ప్రేమ, కరుణతో ఉండటం ఆయన రెండో సిద్ధాంతం. "ఆయన ఎక్కడికెళ్లినా.. నడుము వరకే గోచి కట్టుకొని దుస్తులు లేకుండా తిరుగుతారు. 

ఒకసారి గాంధీజీతో ఒక పిల్లాడు మాట్లాడుతూ.. ' మీరు గోచి కట్టుకోవాల్సిన అవసరం లేదు. మా అమ్మ మీకు కుర్తా కుట్టి ఇస్తుంది" అన్నారు. 'అయితే మీ అమ్మ నలభై కోట్ల మందికి కుర్తాలు కుట్టాల్సి ఉంటుంది. దేశంలో కోట్లాది మందికి కుర్తాలు కొనే స్తోమత లేనప్పుడు.. నేను ఒక్కడ్నే కుర్తా తొడుక్కోవడం నాకు ఇష్టం లేదు'అని చెప్పాడు. ' మరి మీ అమ్మ ఆపని చేయగలదా?' అని గాంధీజీ పిల్లాడి తల నిమురుతూ అడిగారు. అది గాంధీజీ ప్రేమ! ఆ ప్రేమే భారతదేశ హృదయాన్ని గెలిచింది" అని రవీంద్రనాధ్ ఠాగూర్ ఒకసారి తన ప్రసంగంలో గుర్తు చేస్తారు.

బ్రహ్మచారిగా:
ముందు తిండి, తర్వాత శృంగారం మనిషికి కనీస కోరికలు. వాటి పట్ల గాంధీజీ ప్రవర్తన ఎలా ఉండేది ? ఆయన ఇంగ్లాండ్లో స్టూడెంట్ గా ఉన్నప్పుడు.. ఎక్కడ చూసినా నాన్ వెజ్ హోటల్లే ఉండేవి. అక్కడ వెజిటేరియన్ ఫుడ్ కి అంటి పెట్టుకొని ఉండటం చాలా కష్టమనిపించింది. ఆయనకు. వెజ్ హోటళ్లు ఎక్కడోగానీ ఉండేవి కాదు. అలాగని తాను పెట్టుకున్న నియమాలను ఉల్లంఘించలేదు. అప్పుడు రుచీపచీ లేని ఉడికించిన బచ్చలికూర తినేవాడు. తర్వాత ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా తన డైట్ మారుతూ వచ్చింది. 'అ డైట్ ఆరోగ్యంగా ఉండాలి. అదే సమయంలో జంతువులకు సాధ్యమైనంత తక్కువ బాధ కలిగించేదై ఉండాలి. ఇది ఆయన సిద్ధాంతం. దాన్నే సాధన చేశారు.

 ఆయన చెప్పిన డైట్ ఇప్పటికీ ఆచరణీయమే. ఎంతటి కాలుష్యంలో బతుకుతున్నా.. శరీరం నిలబెట్టగలిగే శక్తి ఆ డైటికి ఉంది. నలభై ఏళ్ల వయసులో "నేను పెళ్లి చేసుకొని ఉండాల్సింది కాదు' అని గ్రహించాడు గాంధీ. 'కనీసం ఇప్పుడైనా ఆ ఆలోచన వచ్చింది కదా? అని నలభై ఏళ్ల తర్వాత ఆయన పూర్తి బ్రహ్మచారిగా మారాడు. బ్రహ్మచర్య వ్రతానికి తన భార్య కస్తూర్బాని ఒప్పించాడు. ఆయన బ్రహ్మచర్యం ముఖ్య లక్ష్యం 'సెల్ఫ్ కంట్రోల్', అంతకు ముందు ఆయనలో కోపం ఉండేది. అసాధారణ డైట్స్, ప్రయోగాలతో బ్రహ్మచర్యాన్ని సాధన చేశాడు. బ్రహ్మచర్యంతో తనపై తాను అద్భుతమైన కంట్రోల్ సాధించారు. అదే ఆయన పోరాటానికి వెన్నెముకగా మారింది. ఆహారం, శృంగారం లాంటి విషయాలకు సంబంధించి గాంధీజీ సిద్ధాంతాలను కొంతమంది ఒప్పుకోరు. కానీ, 'సెల్ఫ్ కంట్రోల్' అనేది..ఏపోరాటానికైనా ప్రతి ఒక్కరూ కోరదగిన శక్తి, బలం, సద్గుణమే!

వాడిన  యంత్రాలు రెండే:
గాంధీజీ యంత్రాల వాడకానికి ప్రతికూలంగా ఉండేవారు. వాటి వల్ల దేశీ నైపుణ్యాలు, ఉపాధికి నష్టమని భావించేవారు. అందుకే, బట్టలు నేయడానికి రాటాన్ని ఉపయోగించేవారు. అయితే, ఆయన రెండే యంత్రాలను ఆమోదించారు. ఒకటి సైకిల్, రెండోది టైప్ రైటర్. ఆయనకు సైకిల్ నచ్చడానికి కారణం అది ఎకో ఫ్రెండ్లీ కావడం, దాంతో ఎక్సర్ సైజ్ కూడా దొరుకుతుందనేది మరో కారణం! గాంధీ హ్యాండ్ రైటింగ్ ఎవరికీ అర్థం అయ్యేది కాదు. ఆ సమస్యని అధిగమించేలా చేసిన టైప్ రైటరిని ఆయన అమితంగా ప్రేమించేవారు.

హింసకు దూరంగా:
అహింస పట్ల గాంధీజీ కమిట్మెంట్ ఎలాంటిదో ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రపంచంలో ఎక్కడైనా చెల్లె ఒకే ఒక విలువ, సిద్ధాంతం అహింస! అహింసతో దేన్నైనా ప్రశ్నించవచ్చు, దేన్నైనా రాబట్టొచ్చు. భగవద్గీత కూడా ఒకరకమైన హింసకు మాత్రమే అనుమతినిచ్చింది. "శత్రువుని ద్వేషించకుండా యుద్ధం చేయాలని బోధించింది. దీన్నే మహాత్ముడు తన అహింసకు ఆధారంగా చేసుకున్నాడు. శత్రువుని ద్వేషించకూడదు అనేది ఆచరించాడు. అతని పోరాటం పాపం (చెడు) పైనే కానీ, పాపం చేసినవాడిపై కాదు. ఆ చెడుని జయించడానికి అహింస అనే అద్భుతమైన ఆయుధాన్ని ఉపయోగించాడు. అందరిలో ఆత్మవిశ్వాసం నింపాడు.

గాంధీజీ సత్యాగ్రహం:
ఎంత చదివినా.. ఏం నేర్చుకున్నా మన జ్ఞానమంతా సత్యమే అసలుసిసలైన శక్తి అని చాటి చెప్తోంది. ఆ శక్తి దేవుడికే ఉంటుందని గాంధీజీ నమ్మారు. అందుకే సత్యాన్ని దేవుడితో పోల్చారు. నిజానికి ఒక శక్తి ఉంటుంది బతకడానికి, నిరంతర ప్రయత్నానికి, అంతిమ విజయానికి ఇదే మూలం. అందుకే గాంధీజీ సత్యాగ్రహం చేశారు. ఆయన అహింస, సత్యపోరాటాలే ప్రత్యర్థిని ఓడించాయి. ప్రేమ, గౌరవం, నమ్మకం, విశ్వాసం లాంటి భావాలతో పోరాటం చేస్తున్నప్పుడు.. ప్రత్యర్థి కూడా సత్యాగ్రహి పోరాటాన్ని అర్థం చేసుకుంటాడు. 'ఏది తప్పో? ఏదీ ఒప్పో అని చెప్పేందుకు ప్రతి మనిషిలో ఒక వ్యవస్థ ఉంటుంది. అది ఏదో ఒక రోజు అహింసను అర్ధం అయ్యేలా చేస్తుంది. అప్పుడు ప్రత్యర్థి ఎంత క్రూరంగా హింసించే వాడైనా సరే... అహింసని అర్ధం చేసుకున్నప్పుడు హింసని ఆపేస్తాడు. ఇక, అహింస ఎక్కువ కాలం కొనసాగదు. చివరికి సత్యాగ్రహి డిమాండ్స్ ని ఒప్పుకుంటాడు. అదే నిజానికి, అహింసలకు ఉన్న శక్తి!

మంచి భక్తుడు:
గాంధీజీ ఫాలోవర్స్ ఎంతోమంది గాంధీజీతో తమ అనుభవాలను రికార్డ్ చేశారు. ఆ సంభాషణలు గాంధీజీ వ్యక్తిత్వాన్ని, సిన్సియారిటీని, కళలు, సంగీతం పట్ల ఆయనకున్న ప్రేమను, సెన్సాఫ్ హ్యూమర్ని, ఓపికతో వినడం వంటి అనేక లక్షణాలను బయటపెడతాయి. గాంధీజీ మంచి భక్తుడు. దైవ చింతన, ఉపవాసాలు చేసేవారు. ఉద్యమానికి కూడా నిరాహార దీక్షని ఆయుధంగా వాడేవారు. అన్నీ అహింసని అంటి పెట్టుకునేవే. ఎదుటి వాళ్లు ఏది చేయాలని ఆయన మనసు కోరుకుంటుందో.. దాన్ని ముందు తాను సాధన చేయడం గాంధీజీలో ఉన్న గొప్ప గుణం. గాంధీజీ సిద్ధాంతాలకి కాలంతో, ప్రాంతంతో సంబంధం లేదు. ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా కొంతవరకు పాటించినా.. జీవితంలో కనీసం కొన్ని లక్ష్యాలనైనా చేరుకుంటామనడంలో సందేహం లేదు!