
ఉమ్మడి మెదక్ జిల్లాను కుండపోత వాన ముంచెత్తింది. జిల్లా మొత్తం జలమయైంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని గ్రామాలను వరద చుట్టుముట్టడంతో ప్రజలు నీటిలో చిక్కుకున్నారు. జిల్లాలో రోడ్లన్నీ చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో వర్షం బీభత్సం సృష్టించింది.
ప్రజ్ఞాపూర్‌లో భారీ వర్షాలకు ఊర చెరువు పొంగిపొర్లింది. గజ్వేల్- ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి పై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రెటోల్ బంక్ నీట మునిగింది. చెరువును తలపిస్తున్న రోడ్డుతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వరదకు మర్కుక్ మండలంలోని చేబర్తి గ్రామ సమీపంలో కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి పడింది.
Also Read : ములుగు జిల్లాకు అలర్ట్.. గోదావరికి పెరుగుతున్న వరద.. ఉదృతంగా వాగులు,వంకలు..
తొగుట (మం) చందాపూర్ గ్రామంలో వర్షాలకు ఇండ్లలోకి చేరింది వరద నీరు. బుధవారం (ఆగస్ట్ 27) నుంచి కురుస్తోన్న ఎడతెరిపి లేని వర్షాలతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాగం అప్రమత్తమై సహయక చర్యలు చేపట్టింది.