
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా కుండపోత వాన పడుతోంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, కామారెడ్డి జిల్లాలపై వరుణుడు ఉగ్రరూపం చూపించాడు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఈ రెండు జిల్లాలు జలమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో రోడ్లు చెరువులు , కుంటలను తలపిస్తున్నాయి.
కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షం, వరదతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరి ఎక్కడిక్కకడ రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించిపోయింది. గురువారం (ఆగస్ట్ 28) కూడా రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
భారీ వర్షాల దృష్ట్యా కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు ఆయా జిల్లా కలెక్టర్లు. కలెక్టర్ల ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. బుధవారం (ఆగస్ట్ 27) మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలను వర్షం ముంచెత్తడంతో ఇప్పటికే ఆయా జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు.