
తెలంగాణ అతలా కుతలం అవుతోంది. భారీ వర్షాలు.. ఎగువ ప్రాంతాలనుంచి వరద నీటికి నిర్మల జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు దడ పుట్టిస్తోంది. ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు చేరడంతో దిగువప్రాంతాలకు నీటిని వదులుతున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు కడెం ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతమైన గోదావరిలోకి వరద నీటిని అధికారులు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా... ప్రస్తుతం నీటి మట్టం 695.275 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 4.699 టీఎంసీలు.. అయితే ప్రస్తుతం 3.572 టీఎంసీలు వరద నీరు చేరింది.
ప్రాజెక్ట్ పై భాగమున భారీగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతుందని, ప్రాజెక్ట్ లోకి ఇన్ ప్లో 20, 702 క్యూసెక్కుల వరద నీరు చేరిందని.. ఔట్ ఫ్లో 41, 103 క్యూసెక్కులని అధికారులు వెల్లడించారు.
గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు, పశువుల కాపరులు, గొర్రెల కాపారులు, రైతులు, చేపలు పట్టేవారు గోదావరి నదిలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్టుకు చేరుతున్న వరద నీటి ఉధృతిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.