ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి  వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • రామప్పలో వాలంటీర్ క్యాంప్
  • ఈ నెల 19న నిర్వహణ
  • అనుమతి ఇచ్చిన యునెస్కో

వెంకటాపూర్(రామప్ప), వెలుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయంలో ఈ నెల 19న వాలంటీర్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఈమేరకు శనివారం కలెక్టర్ కృష్ణ ఆదిత్య, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కోఆర్డినేటర్ ప్రొ.పాండురంగారావు ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఈ ప్రోగ్రాంకు సంబంధించిన కరపత్రాలను రిలీజ్ చేశారు. ఈ నెల 19 నుంచి 30వరకు 12రోజుల పాటు 50మంది వాలంటీర్లతో ఈ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. ఇందులో 8 మంది విదేశీ విద్యార్థులు, దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 42 మంది స్టూడెంట్లు పాల్గొంటారని తెలిపారు. రామప్ప గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రోగ్రాంకు యునెస్కో నుంచి కూడా పర్మిషన్ వచ్చిందన్నారు. ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్టులుగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ హాజరు కానున్నట్లు వివరించారు.

స్టేషన్​ఘన్​పూర్ సీఐగా రాఘవేందర్

స్టేషన్ ఘన్ పూర్, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ సీఐగా రాఘవేందర్​ ను నియమించారు. ఈమేరకు శనివారం బాధ్యతలు తీసుకున్నారు. రాఘవేందర్ గతంలో కాజీపేట ట్రాఫిక్, సుబేదారి సీఐగా పనిచేశారు. కొన్ని నెలలుగా సీపీ ఆఫీసులో రిజర్వ్ కేటగిరీలో ఉన్నారు. తాజాగా అతన్ని స్టేషన్ ఘన్ పూర్ సీఐగా ట్రాన్స్​ఫర్ చేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సీఐకి సర్పంచులు అభినందనలు తెలిపారు. టేకుమట్ల ఎస్సైగా చల్లా రాజు.. మొగుళ్లపల్లి(టేకుమట్ల),వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఎస్సైగా చల్లా రాజు శనివారం చార్జ్ తీసుకున్నారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై తమాషారెడ్డి సీసీఎస్ కు ట్రాన్స్​ఫర్ చేశారు. ఎస్సై చల్లా రాజుకు సిబ్బంది, మండల ప్రజాప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు.

బ్యాంక్ కేసులపై లోక్ అదాలత్

వరంగల్ లీగల్, వెలుగు: హనుమకొండలోని న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం బ్యాంక్ కేసులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, వరంగల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.రాధాదేవి హాజరయ్యారు. హనుమకొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కృష్ణమూర్తి, వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జె.ఉపేందర్ రావు ఆధ్వర్యంలో వివిధ రకాల కేసులను పరిష్కరించారు. ఈ అదాలత్​లో యూనియన్ బ్యాంక్ కు సంబంధించిన 489 పీఎల్ సీ కేసులు పరిష్కారం అయ్యాయి. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ పలుగుల సత్యం, లాఆఫీసర్ ఎం.శశిధర్ పాల్గొన్నారు.

ఆగని వీఆర్ఏల పోరు

మహాముత్తారం, వెలుగు: వీఆర్ఏల సమ్మె శనివారం నాటికి 51వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా శాంతియుతంగా నిరవధిక సమ్మెలో పాల్గొని, తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. కేసీఆర్ ప్రకటించిన పే స్కేల్ అమలు చేయాలని, వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలకేంద్రంలో నిర్వహించిన ప్రోగ్రాంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు లింగమల్ల కరుణాకర్, వెంకటేశ్, రవీందర్​, పోచయ్య. మల్లేశ్, శేఖర్, రాజేందర్, దుర్గయ్య, నర్సయ్య పాల్గొన్నారు.

నిజాంలా కేసీఆర్ పాలన

భూపాలపల్లి రూరల్, శాయంపేట, వెలుగు: కేసీఆర్ పాలన నిజాంను తలపిస్తోందని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జి గండ్ర సత్యనారాయణరావు విమర్శించారు. శనివారం భూపాలపల్లి పట్టణంతో పాటు హనుమకొండ జిల్లా శాయంపేటలో తెలంగాణ విలీన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయ లబ్ధి, అధికారం కోసమే బీజేపీ, టీఆర్ఎస్ పోటీ పడి మరీ ప్రశ్నించే గొంతుకల్ని అణగదొక్కుతున్నాయని మండిపడ్డారు. మొన్నటికిమొన్న రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్.. నేడు ఓట్ల కోసమే అంబేద్కర్ పేరు పెట్టారని పేర్కొన్నారు.

వైన్స్ షాప్​లో ఉరేసుకున్న క్యాషియర్
ఓనర్ వేధింపులే కారణమని బంధువుల ఆందోళన

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: వైన్స్ షాప్​లో ఓ క్యాషియర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లికి చెందిన ఏకాంబరం(32).. కుటుంబంతో సహా జిల్లాకేంద్రంలో నివాసం ఉంటున్నాడు. స్థానిక నెహ్రూ సెంటర్​లోని సామ్రాట్ వైన్స్ లో క్యాషియర్ గా పని చేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి.. మద్యం లోడ్ రాగా, ఏకాంబరం ఇంటి నుంచి వైన్స్ కు వెళ్లాడు. లోడ్ దించాక, తిరిగి ఇంటికి వెళ్లలేదు. కుటుంబసభ్యులు ఆందోళన చెంది, వైన్స్ షాప్ కు వచ్చి చూడగా.. ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించాడు.

ఓనర్ వేధింపులే కారణం..

ఏకాంబరం మృతికి వైన్స్ షాప్ యజమాని కృపాకర్ రావు కారణమని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. లెక్కల్లో తేడా వచ్చిందంటూ కొద్దిరోజులుగా కృపాకర్ రావు, ఏకాంబరాన్ని వేధిస్తున్నాడని పేర్కొన్నారు. తమ కుటుంబానికి న్యాయం జరిగే వరకు డెడ్ బాడీ ఇక్కడి నుంచి కదలదని స్పష్టం చేశారు. ఈక్రమంలో పోలీసులు, కుటుంబసభ్యుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఎట్టకేలకు డెడ్ బాడీని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

హసన్ పర్తి, వెలుగు: ప్రేమ విఫలమైందని మనస్తాపం చెందిన ఓ యువకుడు పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హసన్ పర్తి సీఐ నరేందర్ వివరాల ప్రకారం.. హసన్ పర్తి మండలం జయగిరి గ్రామానికి చెందిన రేణుగుంట్ల దిలీప్(23) సెంట్రింగ్ పని చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తుండగా.. ఆమె కాదనడంతో శుక్రవారం రాత్రి 9గంటల టైంలో బీరు బాటిల్​లో పాయిజన్ కలుపుకొని తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయాడు.

కుటుంబ కలహాలతో..

గూడూరు, వెలుగు: కుటుంబ కలహాలతో ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ కు చెందిన పొన్నోజు మమత(33) పదేండ్ల కింద మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన ప్రశాంత్ ను పెండ్లి చేసుకుంది. ఏడాది కింద పాప జన్మించగా.. ఇటీవల గ్రాండ్ గా బర్త్ డే నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ఇరువురి మధ్య చిన్న గొడవ రాగా.. మమత తీవ్ర మనస్తాపం చెందింది. శనివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

డెంగీతో బాలుడి మృతి

కమలాపూర్, వెలుగు: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలకేంద్రానికి చెందిన పబ్బు రియాన్ష్ అనే పది నెలల బాలుడు డెంగీతో చనిపోయాడు. స్థానికంగా నివాసం ఉంటే పబ్బు ఓదెలు– మౌనిక దంపతుల కొడుకైన రియాన్ష్ కు.. ఇటీవల తీవ్ర జ్వరం వచ్చింది. ఆసుపత్రిలో టెస్టు చేయగా.. డెంగీగా తేలింది. దీంతో శనివారం చికిత్స పొందుతూ రియాన్ష్ మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.

జ్వరంతో రైతు..

మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పెద్దంపేటకు చెందిన రైతు దుర్గం పోచయ్య(59) జ్వరంతో చనిపోయాడు. స్థానికుల వివరాల ప్రకారం... పోచయ్య రెండున్నర ఎకరాల్లో మిర్చి పంట వేశాడు. ఇటీవల ఆయనకు డెంగ్యూ సోకగా.. కొద్ది రోజులు అయ్యాక కోలుకున్నాడు. నాలుగు రోజుల కింద మళ్లీ జ్వరం రాగా.. శుక్రవారం రాత్రి చనిపోయాడు.

ఎర్రగట్టుగుట్టలో దొంగల బీభత్సం..

హసన్ పర్తి, వెలుగు: కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగట్టుగుట్టలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంటి తాళాలు, బీరువా పగలగొట్టి రూ.5లక్షల విలువైన 9 తులాల బంగారం, రూ.70వేల క్యాష్​ ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక బసవరెడ్డి టౌన్​షిప్ లో కడెం మహేశ్​అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. గురువారం సాయంత్రం జమ్మికుంటలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. శనివారం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని నగదు, బంగారం మాయమైంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు. క్లూస్ టీం సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.