
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ -19 మార్గదర్శకాలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు అన్నారు. సోమవారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భగవంతరావు మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఉత్సవ కమిటీ నిర్వాహకులు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ.. పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మండపాల వద్ద నలుగురైదుగురు మాత్రమే ఉండాలని.. మండపాల వద్ద శానిటైజర్ ఉంచాలని, మాస్క్ లు ధరించాలని చెప్పారు.
గణేష్ విగ్రహ ఎత్తుల గురించి పోటీ పడవద్దని ఆయన సూచించారు. సెప్టెంబర్ 1వ తేదీన సామూహిక నిమజ్జనం వీలుకాదు కావున భక్తులు సామాజిక దూరం పాటిస్తూ నిమజ్జనం జరుపుకోవాలన్నారు. సహజ నీటి వనరులు ఉన్న చోట తక్కువ మందితో సాదా సీదాగా నిమజ్జనం జరపాలని భగవంతరావు అన్నారు. వినాయకుడి పూజకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలన్నారు. విగ్రహ తయారీదారులను , ఉత్సవాల పై ఆధారపడి జీవనం సాగించే వృత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.