
హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్నవరాత్రోత్సవాలను సజావుగా నిర్వహించేందుకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గురువారం టీజీఐసీసీసీలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. భాగ్యనగర్ గణేశ్ఉత్సవ సమితి, ఖైరతాబాద్ బడా గణేశ్ఉత్సవ సమితి ప్రతినిధులు పాల్గొని అధికారుల దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. అంతకుముందు సీపీ మాట్లాడుతూ నిర్వాహకులు మండప వివరాలను తెలియజేస్తే భద్రత, సీసీటీవీల నిఘా పెట్టడానికి వీలవుతుందన్నారు. మండపాల వద్ద ట్రాఫిక్కు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సేవా భావం ఉన్న వలంటీర్లను నియమించుకోవాలన్నారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ నిమజ్జనం కోసం ప్రత్యేకంగా బేబీ పాండ్స్, క్రేన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 160 స్పెషల్ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. అర్ధరాత్రి వరకు అదనపు ట్రిప్పులు నడిపిస్తామని మెట్రో రైలు అధికారులు కూడా తెలిపారు. అన్ని మండపాల వద్ద హెల్త్టీమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రాత్రి కూడా సిబ్బందిని, అధికారులను నియమిస్తున్నామని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ , భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రెసిడెంట్ రాఘవ రెడ్డి, శశిధర్ రెడ్డి, సందీప్ రాజ్ పాల్గొన్నారు.