మొబైల్స్ దొంగతనం చేసి ఓఎల్ఎక్స్ లో అమ్ముడు

మొబైల్స్ దొంగతనం చేసి ఓఎల్ఎక్స్ లో అమ్ముడు

హైద‌రాబాద్- ఒంట‌రి వ్య‌క్తుల‌పై దాడులు జ‌రిపి సెల్ ఫోన్లు, డ‌బ్బులు ఎత్తుకెళ్తున్న ముఠాను బాచుప‌ల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.  వారి వద్ద నుంచి తొమ్మిది సెల్ ఫోన్లు, 18 వందల రూపాయల నగదు , రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా  శ‌నివారం బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో కూకట్‌పల్లి ఏ సీ పి సురేందర్ రావు  మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని, ఫిలిం నగర్, ఇంద్ర నగర్ కాలనీలో 10 మంది యువ‌కులు నివాసం ఉంటున్నారు. వీళ్లు పగటి పూట స్విగ్గి, జొమాటొలలో డెలివరీ బాయ్ లుగా పని చేస్తున్నారు.

రాత్రి కాగానే ముఠాగా ఏర్పడి రోడ్డుపై ఒంటరిగా కనిపించిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడతారు. ముందుగా వ్యక్తులపై దాడికి పాల్పడుతారు. త‌ర్వాత గాయ‌ప‌డ్డ‌వారు నిస్సహాయ స్థితిలోకి చేరుకోగానే.. వారి వద్ద ఉన్న ఫోన్లు, డబ్బులు దోచుకుటుంటారు.  దోచుకున్న సెల్ ఫోన్లను ఓఎల్‌ఎక్స్ లో అమ్మకానికి పెడతారు. అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తుంటారు. ఎనిమిది నెలల్లో బాచుపల్లి , జగద్దిరిగుట్ట , బొల్లారం , బంజారా హిల్స్ , జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరు దోపిడీలకు పాల్పడ్డారు. వీరిని శుక్రవారం సాయంత్రం బాచుపల్లి కూడలిలో వాన తనిఖీలో భాగంగా చెక్ చేయగా.. దారి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలడంతో ఆరుగురు‌ ముఠా సభ్యులను శ‌నివారం రిమాండ్ కు తరలించారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించనున్నట్లు కేసులో చాక చక్యంగా  వ్యవహరించిన సిఐ నరసింహారెడ్డి, డి ఎస్ఐ రాజు యాదవ్ క్రైమ్ టీం లకు రివార్డులు అమలు చేయనున్నట్లు ఏసిపి తెలిపారు.