ఏపీ సీఐడీ పేరుతో రెయిడ్స్ చేసిన గ్యాంగ్ అరెస్ట్

ఏపీ సీఐడీ పేరుతో రెయిడ్స్ చేసిన గ్యాంగ్ అరెస్ట్
  • ఐటీ సంస్థ డైరెక్టర్​ను కిడ్నాప్ చేసి డబ్బు వసూలు
  • మాజీ ఉద్యోగితో కలిసి స్కెచ్ వేసిన ఏపీ ఎస్సై, అడ్వకేట్
  • 8 మందిని అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు

గచ్చిబౌలి, వెలుగు: సీబీ సీఐడీ అధికారుల పేరుతో గచ్చిబౌలిలోని ఓ ఐటీ సంస్థ మీద రెయిడ్​చేసిన ఓ గ్యాంగ్ ఏకంగా 71.80 లక్షల రూపాయలను కొల్లగొట్టింది. మొత్తం 2.5 కోట్ల రూపాయలకు బేరం కుదుర్చుకోగా మిగిలిన డబ్బు కోసం ఐటీ సంస్థ డైరెక్టర్, ఉద్యోగులను కిడ్నాప్ చేశారు. మరో 2.5 లక్షల రూపాయలను వారి వద్ద నుంచి గుంజి చివరికి ఐటీ సంస్థ డైరెక్టర్​ను ఓ హోటల్​లో వదిలిపెట్టి  పరారయ్యారు. రోజంతా సినీఫక్కీలో హైడ్రామా కొనసాగిన ఈ కేసులో బాధితుడి ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు రంగంలోకి దిగారు. కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ మంగళవారం వెల్లడించారు.

నకిలీ ఐడీ కార్డులు సృష్టించి..

గచ్చిబౌలిలోని డైమండ్ హిల్స్​లో ఆజా యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గత మూడేళ్లుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. మొత్తం 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఈ సంస్థ ఐటీ సపోర్ట్ సేవలను అందిస్తున్నది. ఈ సంస్థలో షేక్​పేట్ ఓయూ కాలనీలో నివాసం ఉండే అక్కెర రంజిత్ కమార్(47) మేనేజర్​గా  పనిచేసేవాడు. తనకు వేతనం పెంచలేదని, ప్రమోషన్ ఇవ్వలేదని సంస్థ యజమాన్యంతో విభేదించి జాబ్​రిజైన్​చేశాడు. కంపెనీ ఓనర్స్​మీద ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన రంజిత్ కుమార్.. కడప జిల్లా మైదుకూరుకు చెందిన అడ్వకేట్ పొలిమేర మహీంద్రకుమార్(38)కు విషయం చెప్పాడు.

ఈ మేరకు మహీంద్రకుమార్ తనకు పరిచయం ఉన్న కర్నూలు డీఐజీ ఆఫీసులో ఎస్ఐగా పనిచేస్తున్న సృజన్​కు విషయం చెప్పాడు. దీంతో ముగ్గురు కలిసి ఆజా యాడ్స్ సంస్థపై నకిలీ సీఐడీ అధికారుల పేరుతో రైడ్ చేయాలని పథకం వేశారు. ఈ మేరకు ఎస్సైసృజన్ తనకు పరిచయం ఉన్న కడవ జిల్లా చిన్నచౌక్​కు చెందిన షేక్ మహ్మద్ అబ్దుల్ ఖాదిర్(33)ను మహీంద్రకు పరిచయం చేశాడు. అబ్దుల్ ఖాదిర్ తమతో పనిచేసేందుకు 15 లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకున్నారు. తనకు ఉన్న పరిజ్ఞానంతో సృజన్ సీఐడీ సైబర్ ఎక్స్ పర్ట్ అధికారిగా నకిలీ కార్డును సృష్టించారు.

ఖాదిర్ సహాయకుడిగా మహీంద్రకు ఓ నకిలీ కార్డును తయారు చేశారు. వీరితో పాటు మరికొందరిని కలుపుకొని ఓ గ్యాంగ్​ను ఏర్పాటు చేశారు. వీరందరికీ సీబీ సీఐడీ ఇన్​స్పెక్టర్, కానిస్టేబుల్ అంటూ ఫేక్ ఐడీ కార్డులను సృష్టించారు. 

కిడ్నాప్​చేసి.. గదిలో బంధించి..

జనవరి 26న అర్ధరాత్రి1.30 గంటలకు ఆజా యాడ్స్ సంస్థ మీద రెయిడ్ ​చేశారు. యూఎస్ క్లయింట్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ కు  ఫిర్యాదు వచ్చిందని, తాము ఏపీ సీబీ సీఐడీ నుంచి వచ్చామని, కార్యాలయంలో తనిఖీలు చేయాలని హడావిడీ చేశారు. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ దర్శన్ సుగుణాకర్ శెట్టిని పిలిచిన అబ్దుల్ ఖాదిర్ ఏదో ఒకటి సెటిల్ చేసుకోవాలని సూచించాడు. అందుకు సుగుణాకర్ శెట్టి సరే అని చెప్పడంతో రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి 2.3 కోట్ల రూపాయలకు ఫైనల్ చేసుకోగా, అప్పటికప్పుడు సుగుణాకర్ శెట్టితో పాటు ఇతర ఉద్యోగులు, సంస్థ బ్యాంకు ఖాతాల నుంచి71.80 లక్షలను పలు అకౌంట్లకు ట్రాన్స్​ఫర్​చేయించుకున్నారు.

మిగిలిన డబ్బు లేదని సుగుణాకర్ చెప్పడంతో సంస్థకు చెందిన దర్శన్, హరిప్రసాద్, చేతన్ లను అక్కడి నుంచి కిడ్నాప్ చేసి మాదాపూర్ లోని ఓ హోటల్ కు తీసుకువెళ్లారు. అక్కడ ఉద్యోగులను ఓ గదిలో బంధించి వారి ఏటీఎం కార్డులను తీసుకొని వాటి ద్వారా మరో 2.5 లక్షలను డ్రా చేయడంతో పాటు10 లక్షలను ఇతర అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. మిగిలిన డబ్బు కోసం డైరెక్టర్ల మీద ఒత్తిడి తీసుకురాగా, వారు స్పందించకపోవడంతో ఉద్యోగులను అక్కడే వదిలేసి గ్యాంగ్ పారిపోయింది.

వారిమీద అనుమానం వచ్చిన సుగుణాకర్ శెట్టి 27వ తేదీన రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కిడ్నాప్, దోపిడీకి పాల్పడిన సూత్రదారి మహీంద్రకుమార్ తో పాటు అబ్దుల్ ఖాదిర్, విజయ్ శేఖర్, మాజీ ఉద్యోగి రంజిత్ కుమార్, రాహుల్, సబ్బక్రిష్ణ, సందీప్ కుమార్, రఘురాజులను పోలీసులు అరెస్టు చేశారు.  కిడ్నాప్, చోరీకి పథకం వేసిన కర్నూలు డీఐజీ కార్యాలయం ఎస్సై సృజన్, మరో నిందితుడు రాజా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.