- మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ
- 12న సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండాలని పిలుపు
కోల్బెల్ట్, వెలుగు: కార్మిక సంఘాలు ఈనెల 12న తలపెట్టిన ఒక్క రోజు సమ్మెతో కార్మికులు రూ.12 కోట్ల వేతనాలు కోల్పోతారని, సమ్మెకు దూరంగా ఉండాలని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ కోరారు. సోమవారం జీఎం ఆఫీస్లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. కార్మిక సంఘాలు పేర్కొన్న సమ్మె డిమాండ్లలో అత్యధికం సింగరేణికి సంబంధం లేనివని అన్నారు. ఆ డిమాండ్లలో సింగరేణి యాజమాన్యం తీర్చగలిగినవి కూడా లేవని.. సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు పాల్గొనాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపులో వెనుకబడి ఉందన్నారు.
ఒక్క రోజు సమ్మెతో సంస్థ రూ.77 కోట్ల ఉత్పత్తికి నష్టం జరుగుతుందని, కార్మికులు వేతనాల రూపంలో రూ.12 కోట్లు కోల్పోతారని తెలిపారు. 2.20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి నష్టం జరుగుతుందన్నారు. సమ్మెకు సింగరేణీయులు దూరంగా ఉండి విధులకు హాజరుకావాలని కోరారు. ఏస్వోటుజీఎం జీఎల్.ప్రసాద్, కేకే ఓసీపీ పీవో మల్లయ్య, ఏరియా ఇంజనీర్ బాలాజీ భగవతి ఝూ, గ్రూప్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.
