సుల్తానాబాద్ లో ఫేక్ ఇన్సూరెన్స్ చేస్తున్న ముఠా అరెస్ట్

సుల్తానాబాద్ లో ఫేక్ ఇన్సూరెన్స్ చేస్తున్న ముఠా అరెస్ట్

ముఠా నాయకుడు వరంగల్ వాసి

సుల్తానాబాద్, వెలుగు: వాహనాలకు ఫేక్ ఇన్సూరెన్స్ చేస్తున్న ముఠాను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై ఉపేందర్ రావు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కోహెడ మండలం వరికోలు గ్రామస్తుడు వేము ఆశిష్ కు చెందిన టాటా ఏస్ వాహనం సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామ శివారులో యాక్సిడెంట్ కు గురైంది. ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకుందామని హెచ్ డీఎఫ్ సీ ఇన్సూరెన్స్ డిపార్ట్ మెంట్ వద్దకు వెళ్లాడు. అది ఫేక్ ఇన్సూరెన్స్ అని తేలడంతో అవాక్కయ్యాడు. సదరు బ్యాంకు సిబ్బంది సైతం తమ బ్యాంక్ పేరు వాడుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్యుమెంట్లు సేకరించి, ముఠా డొంక కదిలించారు. ఫేక్స్ ఇన్సూరెన్స్ చేస్తుంది ఓదెల మండలం శానగొండ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్​గాజుల లక్ష్మణ్ గా గుర్తించారు.

వరంగల్ లోనే మూలాలు..

వరంగల్ జిల్లాకేంద్రంగా గతంలో ఫేక్ ఇన్సూరెన్స్ ముఠాను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.  అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అయితే ఈ ముఠా మూలాలు ఇంకా ఉన్నాయి. సుల్తానాబాద్ లో ఫేక్ ఇన్సూరెన్స్ చేసి అరెస్ట్ అయిన నిందితుడు గాజుల లక్ష్మణ్ కు సహకరించింది వరంగల్ కు చెందిన మహ్మద్ షఫీగా గుర్తించారు. ఇరువురు కలిసి సుల్తానాబాద్ చుట్టుపక్కల ఫేక్ ఇన్సూరెన్స్ చేసినట్లు తేల్చారు. వృత్తిపరంగా ఆటో డ్రైవర్ అయిన లక్ష్మణ్.. తనకు పరిచయం ఉన్న డ్రైవర్ల ఆటోలకు ఇన్సూరెన్స్ చేయిస్తానని చెప్పేవాడు. ఇందుకు సంబంధిం చిన డాక్యుమెంట్లు షఫీకి వాట్సాప్ ద్వారా పంపేవాడు. క్షణాల్లో ఫేక్ ఇన్సూరెన్స్ సృష్టించి మళ్లీ లక్షణ్​కు పంపేవాడు. ఇందుకోసం ఒక్కొక్కరి వద్ద రూ.3వేల నుంచి రూ.10వేల వరకు వసూ లు చేసేవారు. ఇప్పటివరకు 50 వెహికల్స్​కు ఫేక్ ఇన్సూరెన్స్ చేసినట్లు పోలీసులు వివరించారు.