అదొక కక్కుర్తి ముఠా. కాస్ట్ లీ బాటిల్స్ లో చీప్ లిక్కర్ అమ్మే గ్యాంగ్. రోజంతా కష్టపడి సాయంత్రం ఓ పెగ్గు వేసుకుందామనుకునే సగటు మద్యం ప్రియుడి గొంతులోకి కల్తీ మద్యం పంపిస్తున్న దుండగులు. బార్ లు, రెస్టారెంట్లలో తాగి పడేసిన ఖరీదైన్ బాటిల్స్ సేకరించి.. అందులో చీప్ లిక్కర్ నింపి.. అదే బ్రాండ్ పేరున దందాకు పాల్పడుతూ లక్షల్లో సంపాదిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ ఎక్సైజ్ శాఖ పోలీసులు.
హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న నకిలీ మద్యం దందాను అధికారులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ DPO కృష్ణప్రియ మీడియాకు వెల్లడించారు.
కల్తీ మద్యం వ్యవహారంలో ప్రధాన నిందితుడు ప్రకాష్, అతని సోదరుడు భరత్ సహా మరో ముగ్గురిని (మొత్తం ఐదుగురు) పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒడిశాకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు.
నిందితులు ఈవెంట్స్,పెద్ద బార్‌ల వద్ద ఖాళీ అయిన ఖరీదైన బ్రాండ్ల మద్యం సీసాలను సేకరిస్తారు. వాటిలో తక్కువ ధర కలిగిన విదేశీ మద్యాన్ని నింపి, ఒరిజినల్ సీసాల మాదిరిగానే ప్యాక్ చేసి వినియోగదారులకు విక్రయిస్తుంటారు.
నిందితుల నుంచి సుమారు 139 నకిలీ మద్యం సీసాలు, 136 ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రవాణాకు ఉపయోగించిన 3 స్కూటీలు, 4 మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు. వీటి విలువ సుమారు 8 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.
తక్కువ ధరకు వస్తుందని నమ్మి బయట వ్యక్తుల వద్ద మద్యం కొనవద్దని, ఇది ప్రాణాపాయానికి దారితీస్తుందని కృష్ణప్రియ హెచ్చరించారు. నకిలీ మద్యం తాగడం వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని, కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాల్లోనే మద్యం కొనుగోలు చేయాలని సూచించారు.
