
మెహిదీపట్నం, వెలుగు: సిటీలో ఫేక్ స్టడీ సర్టిఫికెట్లు అమ్ముతున్న నలుగురు ముఠా సభ్యులను సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, మెహదీపట్నం పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుంచి వివిధ వర్సిటీలకు చెందిన 108 ఫేక్ స్టడీ సర్టిఫికెట్లు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ అందే శ్రీనివాసరావు మంగళవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. చాంద్రాయణగుట్ట పూల్ బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజీబ్ హుస్సేన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నడుపుతూ విదేశాల్లో వీసా, పైచదువులు, ఎమ్ఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలకోసం అవసరమైన వ్యక్తులకు ఫేక్ స్టడీ సర్టిఫికెట్లు సప్లై చేస్తున్నాడు.
టోలిచౌకి, గుడిమల్కాపూర్ ప్రాంతాలకు చెందిన ఐటీ ఉద్యోగి మహ్మద్ నాసిర్, జిమ్ట్రైనర్లు మహ్మద్ అల్ బషీర్ రెహమాన్ అలియాస్ సోహెల్, జియా-ఉర్- రెహమాన్ సిద్ధికి అతనికి మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. వీరంతా అవసరమైన వ్యక్తులకు సర్టిఫికెట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
సోమవారం వీరు మెహదీపట్నం పీఎస్ పరిధిలోని ఫస్ట్ లాన్సర్ ఈద్గా గ్రౌండ్స్ సమీపంలో ఫేక్ సర్టిఫికెట్లు అందజేస్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సర్టిఫికెట్లను పశ్చిమ బెంగాల్ లోనికలకత్తాకు చెందిన మనోజ్ విశ్వాస్, యూపీలోని మీరట్ కు చెందిన రవీందర్, ముఖేశ్ అజయ్ రెడీ చేసి వీరికి ఇస్తున్నట్లు విచారణలో తేలింది. వీరంతా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.