భూదందాలకు పాల్పడుతున్న గ్యాంగ్​ అరెస్ట్

భూదందాలకు పాల్పడుతున్న గ్యాంగ్​ అరెస్ట్
  • పరారీలో మరో నలుగురు
  • నిందితుల్లో ఒకరు పోలీస్​ అధికారి
  • ముగ్గురు నయీం అనుచరులు

హనుమకొండ, వెలుగు: నకిలీ తుపాకీతో బెదిరిస్తూ భూదందాలకు పాల్పడుతున్న గ్యాంగ్​ను కేయూ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం పది మంది గ్యాంగ్​ లో ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించగా.. ఇంకో నలుగురు పరారీలో ఉన్నారు. గ్యాంగ్ లో ముగ్గురు నయీం అనుచరులతో పాటు ఓ పోలీస్​ అధికారి(ఆర్ఐ), మాజీ ఎంపీపీ ఉండటం చర్చనీయాంశమైంది. అరెస్టయిన వారి నుంచి డమ్మీ తుపాకీ, 2 తల్వార్లు, ఒక ఫార్చునర్​కారు స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ కేయూ ఇన్​స్పెక్టర్​దయాకర్, ఎస్సై సంపత్​ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లాకు చెందిన ముద్దసాని వేణుగోపాల్​ గతంలో గ్యాంగ్​స్టర్​నయీం వద్ద పని చేశాడు. నయీం ఎన్​కౌంటర్ అనంతరం వరంగల్ నగరానికి వచ్చిన ఆయన గతంలో వరంగల్ కమిషనరేట్​పరిధిలో, ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్​జిల్లాలో రిజర్వ్ ఇన్​స్పెక్టర్(ఆర్ఐ)గా పని చేస్తున్న సంపత్​కుమార్, జయశంకర్​ జిల్లాకు చెందిన మల్లన్న అనే మాజీ ఎంపీపీతో కలిసి భూ దందాలకు తెరలేపాడు. నయీం గ్యాంగ్​ లో పని చేసిన హనుమకొండ సిద్ధాపూర్​కు చెందిన మేకల రమేశ్, హసన్​పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన పంగ రవిని వారితో కలుపుకొన్నారు. వీరితో పాటు హసన్​పర్తి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన కేతెపాక రమేశ్, భీమారానికి చెందిన బొజ్జ హరిబాబు, ప్రవీణ్, శాయంపేట మండలం కొప్పులకు చెందిన అలువాల నరేశ్​తో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. వీరంతా భూ సెటిల్​మెంట్లు చేసేవారు. అవసరాన్ని బట్టి దాడులకూ తెగబడేవారు. ఇందుకు ఓ డమ్మీ తుపాకీతో పాటు 2 తల్వార్లు సమకూర్చుకున్నారు. ఇలా వరంగల్ కమిషనరేట్​పరిధిలో పెద్దఎత్తున భూదందాలకు పాల్పడ్డారు. నయీం గ్యాంగ్, ఆర్ఐ ఆధ్వర్యంలో సాగుతున్న భూదందా గురించి కాకతీయ యూనివర్సిటీ​ పోలీసులకు సమాచారం అందింది. దీంతో కేయూ పోలీసులు కూపీ లాగారు.

పరారీలో ప్రధాన నిందితులు 

భూ దందాలకు తెరలేపిన వేణుగోపాల్​ హనుమకొండ యాదవ నగర్​ లో ఉంటూ గోపాలపూర్, భీమారం సమీపంలో రియల్​ ఎస్టేట్​ఆఫీస్​తెరిచాడు. అందులోనుంచే మిగతా ముఠా సభ్యులతో దందాకు సంబంధించిన కార్యకలాపాలు సాగించేవాడు. గ్యాంగ్ సభ్యులు వస్తున్నారనే సమాచారంతో  జులై 29 రాత్రి 9.30 గంటల సమయంలో భీమారంలోని పలివేల్పుల క్రాస్​ రోడ్డు సమీపంలో పోలీసులు వెహికిల్ చెకింగ్​చేపట్టారు. ఏ1 నిందితుడైన ముద్దసాని వేణుగోపాల్​కారును అలువాల నరేశ్​నడుపుతూ వచ్చాడు. కారు ఆపి తనిఖీ చేయగా అందులో తల్వార్​ దొరికింది. అతడిని పట్టుకుని విచారణ జరపగా ఇంట్లో మరో తల్వార్​లభించింది. పోలీసులు ముఠా సభ్యుడైన బొజ్జ హరిబాబును పట్టుకుని అతడి నుంచి  డమ్మీ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్యాంగ్​ సభ్యులైన కేతెపాక రమేశ్, మేకల రమేశ్​, పంగ రవి, ప్రవీణ్​ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులైన ముద్దసాని వేణుగోపాల్​, ఏ2 సంపత్​ కుమార్​(ఆర్​ఐ), మాజీ ఎంపీపీ మల్లన్న, వేణుగోపాల్​ డ్రైవర్​ క్రాంతి పరారీలో ఉన్నారు. పట్టుకున్న ఆరుగురిని ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు.