శ్రీనివాస్​గౌడ్​ హత్యకు కుట్ర చేసిన్రు

శ్రీనివాస్​గౌడ్​ హత్యకు కుట్ర చేసిన్రు
  • ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్ లో ఐదుగురిని అరెస్టు చేసినం 
  • నిందితుల్లో ఆయన పీఏ, డ్రైవర్ ఉన్నరు 
  • జితేందర్​రెడ్డి, డీకే అరుణ పాత్రపై దర్యాప్తు చేస్తమని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: మంత్రి శ్రీనివాస్‌‌ గౌడ్‌‌ హత్యకు కుట్ర జరిగిందని సైబరాబాద్‌‌ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. రూ.15 కోట్లకు సుపారీ డీల్ కుదిరినట్లు గుర్తించామని తెలిపారు. ఈ కేసులో గత నెల 26న ముగ్గురిని అరెస్టు చేయగా, బుధవారం మరో ఐదుగురిని ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సర్వెంట్​ క్వార్టర్స్​లో అరెస్టు చేశామన్నారు. వారి నుంచి 9 ఎంఎం రివాల్వర్, బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ‘‘మహబూబ్‌‌నగర్‌‌‌‌కు చెందిన చలువగ్‌‌ రాఘవేంద్ర రాజు అలియాస్‌‌ రఘు(47) రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌‌ గగన్‌‌పహాడ్‌‌కు చెందిన ఫారూఖ్‌‌తో కలిసి శ్రీనివాస్ గౌడ్‌‌ను హత్య చేసేందుకు కుట్ర చేశాడు. ఫారూఖ్‌‌ లేదా ఇంకెవరితోనైనా సరే హత్య చేయించాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం రూ.15 కోట్లు ఇస్తామని చెప్పాడు. ఇదే విషయాన్ని మహబూబ్‌‌నగర్‌‌‌‌ టీచర్స్ కాలనీకి చెందిన గోల్డ్‌‌ షాప్‌‌ ఓనర్ గులామ్‌‌ హైదర్‌‌ అలీకి ఫారూఖ్‌‌ చెప్పాడు. దీంతో హత్య కోణం బయటపడుతుందనే అనుమానంతో ఫారూఖ్‌‌, హైదర్ అలీని హత్య చేసేందుకు ముఠాలోని మిగతావాళ్లు ప్లాన్ చేశారు. 

ఫారూఖ్, హైదర్ అలీ గత నెల 23న మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్ కు వచ్చారు. సుచిత్ర వద్ద ఉన్న లాడ్జీలో షెల్టర్ తీసుకున్నారు. 25న లాడ్జీ నుంచి బయటకు వచ్చారు. అప్పుడు వారిపై మహబూబ్‌నగర్‌‌ జిల్లాకు చెందిన నాగరాజు, బండేకర్ విశ్వనాథ్ రావు, వర్ణ యాదయ్యలు కత్తులతో దాడికి ప్రయత్నించారు. ఫారూఖ్‌, హైదర్‌‌ అలీ తప్పించుకొని పేట్‌ బషీరా‌బాద్‌ పోలీసులకు కంప్లయింట్ చేశారు. 26న నాగరాజు, విశ్వనాథ్ రావు, యాదయ్యలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు” అని సీపీ వివరించారు. నాగరాజు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, అమరేందర్‌, మధుసూదన్‌ రాజు కలిసి శ్రీనివాస్ గౌడ్‌ హత్యకు కుట్ర పన్నినట్లు గుర్తించామని సీపీ తెలిపారు. ‘‘నాగరాజు గ్యాంగ్‌ అరెస్టు విషయం తెలియగానే రాఘవేంద్రరాజు సహా ముగ్గురు నిందితులు మహబూబ్‌నగర్‌‌ నుంచి వైజాగ్‌, అక్కడి నుంచి ఢిల్లీకి పారిపోయారు. మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి సర్వెంట్‌ క్వార్టర్స్‌లో షెల్టర్ తీసుకున్నారు. జితేందర్‌‌ రెడ్డి పీఏ రాజు, డ్రైవర్ థాపా నిందితులకు షెల్టర్ ఇచ్చారు.” అని చెప్పారు. మాజీ ఎంపీ జితేందర్‌‌రెడ్డి పాత్రపై కూడా విచారణ జరుపుతామన్నారు. మధుసూదన్ రాజు, అమరేందర్‌‌ ఇస్తామని చెప్పిన సుపారీ డబ్బు రూ.15 కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలనే విషయంపైనా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ‘‘హత్యకు ఎక్కడ ప్లాన్ చేశారనే వివరాలు రాబడతాం. ఇంకా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరున్నారనేది దర్యాప్తు చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సైంటిఫిక్ ఎవిడెన్స్‌ ద్వారా డీకే అరుణతో పాటు మరెవరికైనా సంబంధాలు ఉన్నాయా? అనే వివరాలు రాబడతాం” అని చెప్పారు.