
- మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: ఖైరతాబాద్ గణేశుడికి మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు వీరికి వినాయకుని ప్రతిరూపాలను బహూకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా గణేశ్ మండపాలకు మన రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోందని తెలిపారు. లక్షలాది మంది భక్తులతో పాటు తానూ ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, పాడిపంటలతో ఉండాలని, ప్రజాపాలనలో మరింత సేవ చేసేలా, రాష్ట్ర అభివృద్ధికి విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.హైదరాబాద్‌లో బోనాలు, గణేశ్ ఉత్సవాలు, మరో 15 రోజుల్లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని..ఇది హైదరాబాద్‌లో గంగా-జమునా తెహజీబ్ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నదని చెప్పారు. 71వ ఏడాది ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలను విజయవంతం చేసిన ఉత్సవ సమితి, అధికారులకు మంత్రి, పీసీసీ చీఫ్ ధన్యవాదాలు తెలిపారు.