అలియా భ‌ట్ సినిమాకు సుప్రీంకోర్టు షాక్

అలియా భ‌ట్ సినిమాకు సుప్రీంకోర్టు షాక్

అలియా భ‌ట్ సినిమాకు మ‌రో షాక్ త‌గిలింది. సినిమా పేరు మార్చాలంటూ సుప్రీంకోర్టు చెప్పింది. అలియా లీడ్ రోల్ ప్లే చేస్తున్న మూవీ గంగూబాయి క‌తియ‌వాడి. ఈ చిత్రాన్ని ప్రముఖ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఈసినిమా మ‌రో రెండు రోజుల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో సినిమా పేరు మార్చాలంటూ.. సుప్రీంకోర్టు పేర్కొంది. సినిమా విడుదలను ఆపాలంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లపై విచారణ జరిపిన కోర్టు.. సినిమా పేరును మార్చాలని భన్సాలీ ప్రొడక్షన్స్‌కు సూచించింది. 

గంగూబాయి దత్తత కుమారుడయిన బాబు రాజీవ్ షా సుప్రీంలో ఈ పిటిషన్ దాఖ‌లు చేశారు. తన తల్లిని అవమానకర రీతిలో చూపించారంటూ ఆయ‌న ఆరోపించారు. దీంతో ఈ పిటిషన్‌పై తుది విచారణను గురువారం జరపనున్నట్టు దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రసిద్ధ రచయిత, జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ నవలను ఆధారంగా చేసుకుని ‘గంగూబాయి కతియవాడి’ని భన్సాలీ తెరకెక్కించాడు.

అయితే భ‌న్సాలీ మూవీపై వివాదాలు, కేసులు కోర్టులు ఇవాళ కొత్తేం కాదు. గతంలో కూడా ఆయ‌న తీసిన ప‌లు సినిమాలు.. కోర్టుల‌కెక్కాయి. దీపికా, రణ్ వీర్ సింగ్ న‌టించిన‌ ‘గోలీయేంకీ రాస్ లీలా రామ్ లీలా’ పేరును ‘రామ్ లీలా’గా మార్చాల్సి వ‌చ్చింది. అదే విధంగా ‘రాణి పద్మావతి’  సినిమాను కూడా పద్మావత్ గా మార్చాడు. తాజాగా భ‌న్సాలీ తీస్తున్న‌‘గంగూబాయి’ చిత్రానికి వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు వాటిని కోర్టు కొట్టేసింది.