మిస్సింగ్ బొగ్గుపై సీబీఐ విచారణ జరిపించాలి..26 లక్షల టన్నుల బొగ్గు ఏమైందో భట్టి, శ్రీధర్ బాబు చెప్పాలి: గంగుల కమలాకర్

మిస్సింగ్ బొగ్గుపై సీబీఐ విచారణ జరిపించాలి..26 లక్షల టన్నుల బొగ్గు ఏమైందో భట్టి, శ్రీధర్ బాబు చెప్పాలి: గంగుల కమలాకర్

హైదరాబాద్‌‌, వెలుగు: సింగరేణిని ప్రభుత్వం దోచుకుంటున్నదని బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ ఆరోపించారు. ఆర్జీ–1కు తాను, హరీశ్‌‌రావు వెళ్తే పోలీసులు అడ్డుకున్నారన్నారు. అక్కడ 3.90 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నట్టు ప్రభుత్వం చెప్పిందని, మంత్రి శ్రీధర్​ బాబు ఆ బొగ్గు నిల్వలను చూపించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌‌లో మీడియాతో మాట్లాడారు. బొగ్గు నిల్వలపై ఇప్పటిదాకా డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క నోరు విప్పలేదని విమర్శించారు.

సింగరేణిని దివాళా తీయించేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి బంధువులకు కాంట్రాక్టులు ఇస్తున్నారని, సింగరేణిలో ప్రస్తుతం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారని మండిపడ్డారు. బొగ్గు మిస్సింగ్‌‌పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 26 లక్షల టన్నుల బొగ్గు ఏమైందో భట్టి విక్రమార్క, శ్రీధర్‌‌‌‌బాబు చెప్పాలన్నారు. సింగరేణి అవినీతిపై నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, సింగరేణిలో మెడికల్ బోర్డు ఎప్పుడు పెడతారో చెప్పాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్​ చేశారు. ఉద్యోగుల జీతాల కోసం సింగరేణి సంస్థ అప్పులు చేస్తోందన్నారు.