కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గంగుల ఫైర్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై గంగుల ఫైర్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. కరీంనగర్ లో ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోని రైస్ మిల్లులపై  దాడులు చేస్తే ఇప్పటి వరకు ఎంత దొరికిందని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి పౌరసరఫరాల శాఖ చేసే ప్రొక్యూర్ మెంట్, ఎఫ్సీఐ లెవీ సేకరణ తదితర అంశాలపై అవగాహన లేకుండామాట్లాడుతున్నారని గంగుల మండి పడ్డారు. కేంద్ర మంత్రిగా ఒక అంశంపై మాట్లాడే ముందు అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. 

తెలంగాణ వ్యక్తినన్న విషయం మర్చిపోయి కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని గంగుల విమర్శించారు. రాష్ట్రంలో 4.53 లక్షల సంచుల ధాన్యం మాయమైనట్లు ఎఫ్ సీఐ నివేదిక ఇస్తే ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్లు మాయం చేశారని, దానిపై విచారణ జరపాలని కిషన్ రెడ్డి కోరడం అవగాహనరాహిత్యానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో ఒక్క బస్తా మిస్ యూజ్ అయినా వాటిని ఆర్ఆర్ యాక్ట్ కింద రికవరీ చేయడం రాష్ట్ర బాధ్యత అని అన్నారు. 

ప్రభుత్వం వద్ద గన్నీ బ్యాగులు లేవన్న కిషన్ రెడ్డి ఆరోపణలపైనా గంగుల స్పందించారు. రాష్ట్రంలో 3.50కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని, దమ్ముంటే కేంద్రమంత్రి వచ్చి లెక్క పెట్టుకోవచ్చన్నారు. ఇకనైనా వాస్తవాలు మాట్లాడాలని హెచ్చరించారు.