జోరుగా గంజాయి దందా.. చాపకింద నీరుల వ్యాపారం

జోరుగా గంజాయి దందా.. చాపకింద  నీరుల  వ్యాపారం
  • ఉమ్మడి మెదక్ లో చాపకింద  నీరుల  వ్యాపారం 

సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు : ఉమ్మడి మెదక్ జిల్లాలో గంజాయి జోరుగా రవాణా అవుతోంది.  సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో  గంజాయి వాడకం, రవాణా  ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కాలేజీల పరిసరాల్లో యువకులు గంజాయి వాడుతున్నట్టు తెలుస్తోంది.  గంజాయి వ్యాపారం   జోరుగా సాగుతున్నా  అధికారులు  నియంత్రించలేకపోతున్నారన్న  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమ రవాణాకు నేషనల్ హైవేలు అడ్డాగా మారాయి.  స్మగ్లర్లు ముంబై హైవే, రాజీవ్ రహదారుల మీదుగా గంజాయి తరలిస్తున్నారు.   

సంగారెడ్డి జిల్లాలో...

సంగారెడ్డి జిల్లా నాలుగు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉంటుంది. 65వ నేషనల్ హైవేతోపాటు 161వ హైవే ఉండగా, వాటి మీదుగా  గంజాయి, క్లోరల్ హైడ్రేట్ ఇతర రాష్ట్రాలకు  తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్  నుంచి  సంగారెడ్డి మీదుగా కర్ణాటక, మహారాష్ట్రకు  సరుకును  రవాణా చేస్తున్నారు. రాష్ట్ర బార్డర్లలో పోలీసు చెక్ పోస్ట్ లేకపోవడం, పైగా నమ్మదగిన సమాచారం ఉంటేనే తప్పా.. తనిఖీలు చేయకపోవంతో రవాణాకు అడ్డు లేకుండా పోతోంది.  ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, ఒడిశా బార్డర్ల నుంచి గంజాయిని హైదరాబాద్ కు తీసుకువచ్చి అక్కడి నుంచి  సంగారెడ్డి, జహీరాబాద్ మీదుగా పూణేకు తరలిస్తున్నారు.  సంగారెడ్డి జిల్లా లో ఒకప్పుడు గంజాయి సాగుకు తీవ్రంగా ఉండేది.  క్రమేణ సాగు తగ్గినప్పటికీ  అక్రమార్కులు రవాణా మాత్రం ఆగడంలేదు. 

మెదక్ జిల్లాలో...

మెదక్​ జిల్లాలో కంపెనీలు ఉన్న శివ్వంపేట, నర్సాపూర్​, మనోహరాబాద్​, తూప్రాన్​, చేగుంట, చిన్నశంకరంపేట మండలాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు వందలాది మంది పనిచేస్తున్నారు. దీనిని ఆసరా చేసుకుని గంజాయి వ్యాపారులు మహారాష్ట్ర, కర్నాటక నుంచి అక్రమంగా ఎండు గంజాయి తీసుకువచ్చి సీక్రెట్​గా అమ్ముతున్నారు. కిలోల లెక్కన తెచ్చి 100, 50 గ్రాముల చొప్పున చిన్నచిన్న పాకెట్​లు గా చేసి పాన్​ షాప్​లు, హోటళ్లలో విక్రయిస్తున్నారు. 

ALSO READ :రైస్ మిల్లర్ల మాయాజాలం.. సీఎంఆర్ లో ఘరానా మోసం

ఎక్సైజ్​ ఆఫీసర్లకు దొరక్కుండా ఉండేందుకు చాక్లెట్ల రూపంలో గంజాయి అమ్మకాలు చేస్తున్నారు.  కార్మికులతో పాటు, యువకులు గంజాయికి అలవాటు పడుతున్నారు. కొందరు బానిసలుగా మారి గంజాయి లేకుండా ఉండలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. గంజాయి తాగిన మైకంలో బైక్​ల మీద స్పీడ్​గా వెళ్తూ ప్రమాదాల్లో చనిపోతున్నారు.  గతంలో శివ్వంపేట, మెదక్​, రామాయంపేటలో ఎండు గంజాయి, మనోహరాబాద్​లో గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. తాజాగా ఇటీవల నర్సాపూర్​ పట్టణంలో విఘ్నేశ్వర కాలనీలో సమీరొద్దీన్​ అనే వ్యక్తి ఇంట్లో ఎక్సైజ్​ ఆఫీసర్​లు రైడ్ చేసి రెండు కిలోల 900 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్టూడెంట్స్​ను టార్గెట్​ గా చేసుకుని కొంత కాలంగా అతను సీక్రెట్​గా గంజాయి అమ్ముతున్నట్టు గుర్తించారు.

 సిద్దిపేట జిల్లాలో...

సిద్దిపేట జిల్లా లో గంజాయి అమ్మకాల పై పోలీసుల చర్యలు కొంత మేర సత్పలితాలను ఇస్తున్నా కొన్ని చోట్ల మాత్రం ఇంకా  గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు సాగుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, కార్మికులు, యువకులను టార్గెట్ గా చేసుకుని కొందరు రహస్యంగా  సమీప జిల్లా నుంచి తెచ్చి అమ్ముతున్నారు. పోలీసుల చర్యలు గంజాయి అమ్మకాలపై   కొంత మేర ప్రభావం చూపినప్పటికి పూర్తి స్థాయిలో మాత్రం నిలిచిపోలేదు.  కొంత కాలం  క్రితం చేర్యాల, బెజ్జంకిల్లో గంజాయి విక్రేతలు పట్టుబడ్డారు.  యువత గంజాయి బారిన పడుతుండటంతో కొందరు సమీప జిల్లాల నుంచి కొద్ది కొద్దిగా తెస్తూ అమ్మకాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.  గతంలో దుబ్బాక, చేర్యాల పట్టణాల్లోని కొన్ని ఇండ్ల ల్లో గంజాయి మొక్కల పెంపకాన్ని పోలీసులు గుర్తించి వాటిని ధ్వంసం చేశారు.  

చెక్ పోస్టులు లేక...

సంగారెడ్డి జిల్లాకు ఆనుకుని ఉన్న స్టేట్ బార్డర్ ప్రాంతాల్లో పోలీసు చెక్ పోస్ట్ లు ఎత్తేశారు. వీటికి తోడు జహీరాబాద్ సమీపంలోని బీదర్ చౌరస్తా, చిరాగ్ పల్లి కమర్షియల్ చెక్ పోస్టులను కూడా తొలగించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు లింక్ గా ఉన్న ఈ హైవేపై పోలీస్ చెక్ పోస్ట్ లేకపోవడం అక్రమార్కులకు రాచమార్గంగా మారింది.  కోహిర్ మండలం సిద్దాపూర్ తండాలోని చెరుకు తోటలో పెంచుతున్న 56 గంజాయి మొక్కలను ధ్వంసం చేసి ఒకరిని అరెస్టు చేశారు. అలాగే జహీరాబాద్ మండలం అల్గోల్ చౌరస్తా  వద్ద 74 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. కారును సీజ్ చేసి ఒకరిని అరెస్టు చేశారు. రాయికోడ్ మండలంలోని సింగీతం గ్రామంలో తెల్ల కుసుమ పంటతో పాటు గంజాయి సాగు చేయగా ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేసి కేసు నమోదు చేశారు.