- ఇండ్ల మధ్యలో తాగొద్దన్నందుకు రాళ్లు, కర్రలతో దాడి
- ఏడుగురిని అరెస్ట్ చేసిన సరూర్ నగర్ పోలీసులు
ఎల్ బీనగర్,వెలుగు : ఇండ్ల మధ్యలో గంజాయి, మందు తాగొద్దన్నందుకు మందుబాబులు అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడడమే కాకుండా చంపేస్తామని బెదిరించారు. తీవ్రంగా గాయపడిన ఇంటి ఓనర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సరూర్ నగర్ ఇన్ స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపిన ప్రకారం.. గురువారం అర్ధరాత్రి చైతన్యపురి మెట్రోస్టేషన్ .. నేతాజీ నగర్ లోని ప్రైవేట్ స్థలంలో శంకు యాదవ్, వంశీ, షాహిద్, హరీష్, సోను, సుమన్, మరికొందరు గంజాయి మద్యం తాగుతున్నారు.
పక్క ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి వచ్చి న్యూసెన్స్ చేయొద్దని చెప్పగా గొడవకు దిగారు. పోలీసులకు కంప్లయింట్ చేస్తానని మొబై ల్ లో వాళ్ల ఫొటోలు తీసుకొని వెళ్లిపోయాడు. దీంతో మందుబాబులు అతని ఇంటి కిటికీల అద్దాలను పగలగొట్టారు. వారు భయపడిన బయటకు రాలేదు. ఇంటి ఓనర్ జనార్దన్ నాయుడుకు కాల్ చేసి చెప్పగా వచ్చి ఇంటిని పరిశీలిస్తుండగా మందుబాబులు అతనిపై కూడా కర్రలు,రాళ్లతో దాడి చేశారు.
స్థానికులు రావడం మందుబాబులు పారిపోయారు. గాయపడిన జనార్దన్ ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్ కు పంపారు.