- పంచాయతీలు, మున్సిపాలిటీల్లో చెత్త సేకరణలో కొత్త విధివిధానాలు
- అమల్లోకి ‘ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు-2026’
- తడి, పొడి చెత్తతోపాటు ఇకపై శానిటరీ, స్పెషల్ కేర్ వ్యర్థాలు విడివిడిగా సేకరించాలి
- ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్, వెలుగు: పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చెత్తను కేవలం పారవేయడమే కాకుండా.. ఉత్పత్తి చేసిన చోటే దానిని శుద్ధి చేయాలన్న నిబంధనను తీసుకొచ్చింది. మీ దగ్గర తయారయ్యే చెత్తను మీరే ఎరువుగా మార్చుకోవాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2026’ను గెజిట్ రూపంలో విడుదల చేశాయి. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలు, భారీ అపార్ట్‌మెంట్లు తమ వ్యర్థాలను సొంతంగానే నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది.
2016 నాటి పాత నిబంధనల స్థానంలో పకడ్బందీగా రూపొందించిన ఈ కొత్త రూల్స్ గత నెల 1 నుంచి అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ, మున్సిపల్ ఆఫీసర్లకు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించింది. పంచాయతీలు, మున్సిపాల్టీల్లో చెత్త నిర్వహణ విధి విధానాలపై అవగాహన కల్పించారు.
కంపోస్టింగ్ లేదా బయో-మెథనేషన్ ద్వారా ఎరువుగా మార్చుకోవాలి..
గేటెడ్ కమ్యూనిటీలు, భారీ వ్యర్థ ఉత్పత్తిదారులు తమ ప్రాంగణాల్లోనే చెత్తను శుద్ధి చేసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కొత్త నిబంధనల ప్రకారం 5 వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు, సంస్థలు, హోటళ్లు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు, విద్యాసంస్థలు, హాస్టళ్లు తదితర సంస్థలను ‘భారీ వ్యర్థ ఉత్పత్తిదారులు’గా పరిగణిస్తారు.
తమ ప్రాంగణంలోనే తడి చెత్తను శుద్ధి చేసుకోవాలి. సహజంగా కుళ్లిపోయే వ్యర్థాలను తమ ప్రాంగణంలోనే కంపోస్టింగ్ లేదా బయో-మెథనేషన్ ద్వారా ఎరువుగా మార్చుకోవాలి. వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్న చోటే శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ వీలు పడకపోతే, ప్రభుత్వం గుర్తించిన ఏజెన్సీలకు భారీగా ‘యూజర్ ఫీజు’ చెల్లించి పంపాల్సి ఉంటుంది. ప్రతి భారీ ఉత్పత్తిదారు ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని, తమ వద్ద చెత్త శుద్ధి అవుతున్నట్లు ధృవీకరణ పత్రాలు పొందాలి.
నాలుగు రకాలుగా చెత్తను వేరుచేయాలి
ఇప్పటిదాకా తడి చెత్త, పొడి చెత్త గా రెండు రకాలుగా విభజించి రెండు డస్ట్ బిన్లలో చెత్తను వేర్వేరుగా వేసేవారు. కానీ, ఇకపై వ్యర్థాలను నాలుగు రకాలుగా వేరు చేయాల్సిందేనని కొత్త రూల్స్ చెబుతున్నాయి. వంటగదిలోని ఆహార వ్యర్థాలు, కూరగాయలు, పండ్లు తదితరాలను తడి వ్యర్థాలుగా, ప్లాస్టిక్, కాగితం, గాజు, లోహాలు, రబ్బరును పొడి వ్యర్థాలుగా విభజించారు.
శానిటరీ వ్యర్థాలు విభాగంలో డైపర్లు, శానిటరీ నాప్కిన్లు, కండోమ్స్ ను విడివిడిగా కవర్లలో వేసి అందించాలి. వాడిన బ్యాటరీలు, ట్యూబ్ లైట్లు, పెయింట్ డబ్బాలు, పురుగుల మందులు, వాడిన సూదులు, సిరంజీలు, ట్యాబ్లెట్లు స్పెషల్ కేర్ వ్యర్థాలుగా విభజించారు.
వార్డు సభ్యులే వారధులు
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, వార్డు, శానిటేషన్ ఆఫీసర్లు, పారిశుధ్య సిబ్బంది, కార్యదర్శులు, వార్డుమెంబర్లను ‘లీడ్ ఫెసిలిటేటర్స్’గా ప్రభుత్వం నియమించనుంది. ఇంటింటికీ తిరిగి చెత్త విభజనపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వీరిదే. రోడ్లపై వ్యాపారం చేసే వీధి వ్యాపారులు తాము వాడే ప్లేట్లు, గ్లాసులు, డబ్బాలు, కూరగాయల వ్యర్థాలను సేకరించేందుకు తగిన బుట్టలను ఉంచుకోవాలి.
ఈ వ్యర్థాలను స్థానిక సంస్థలు సూచించిన కేంద్రాలకు లేదా వాహనాలకు మాత్రమే అప్పగించాలి. కొబ్బరి బోండాల చిప్పలు, ప్లాస్టిక్ ప్లేట్లు రోడ్డు మీద పడేస్తే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. కాలువల్లో చెత్త వేసినా, బహిరంగంగా తగలబెట్టినా శిక్ష తప్పదని హెచ్చిరించింది. అలాగే హాస్పిటల్ వ్యర్థాలను మామూలు చెత్తలో కలిపితే ఆసుపత్రుల సీజ్ తప్పదు.
ఇండ్లు కూల్చినప్పుడు వచ్చే మట్టి, ఇటుక ముక్కలను నిబంధనల ప్రకారమే తరలించాలి. ఇండ్ల నిర్మాణాల వల్ల వచ్చే శిథిలాలు నిబంధనల ప్రకారం విడిగా ఉంచాలి. పెరటి తోటలు, ఉద్యానవనాల నుంచి వచ్చే వ్యర్థాలను కూడా స్థానిక సంస్థల ఆదేశాల మేరకు వేరుగా నిల్వ చేయాలి. వీధులు, బహిరంగ ప్రదేశాలు, మురుగునీటి కాలువలు, నీటి వనరుల్లో చెత్త వేయడం నిషేధించింది. చెత్తను తగులబెట్టడం లేదా భూమిలో పాతిపెట్టడం వంటి పనులు చేయరాదు. నిబంధనల ప్రకారం స్థానిక సంస్థలు నిర్ణయించిన ‘యూజర్ ఫీజు’ను వినియోగదారులు తప్పనిసరిగా చెల్లించాలి.
వంద మంది దాటితే ముందే చెప్పాలి
పెళ్లిళ్లు, బర్త్ డేలు లేదా ఏవైనా సభలు నిర్వహించినా.. 100 మంది కంటే ఎక్కువ గెస్టులు వస్తే.. కనీసం 3 రోజుల ముందే మున్సిపల్ లేదా పంచాయతీ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అక్కడ వచ్చే చెత్తను నిర్వాహకులే వేరు చేసి అధికారులకు అప్పగించాలి. లైసెన్స్ లేని ప్రదేశాల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. అక్కడ ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను నిర్వాహకులే వేరు చేసి అధికారులకు అప్పగించాలి.
కలెక్టర్లకే పర్యవేక్షణ బాధ్యతలు
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని వ్యర్థాల నిర్వహణపై ప్రతి నెలా పర్యవేక్షణ చేయాలి. అలాగే కార్పొరేషన్లలో కమిషనర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించే భారీ వ్యర్థ ఉత్పత్తిదారులకు అవసరమైతే నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఉల్లంఘనలను గుర్తించి అప్పటికప్పుడే జరిమానాలు విధించేందుకు మొబైల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. మూడు స్థాయిల శిక్షలు కూడా ఖరారు చేశారు. మొదటి తప్పుకు జరిమానా, రెండోసారి తప్పు చేస్తే నేర విచారణ, పదే పదే తప్పు చేస్తే పర్యావరణ చట్టాల కింద కఠిన శిక్షలు పడనున్నాయి.
కాగా, 2026 అక్టోబర్ నాటికి పాత డంపింగ్ యార్డుల్లో, చాలా ఏళ్లుగా పేరుకుపోయిన పాత చెత్తను ‘లెగసీ వేస్ట్’ను క్లియర్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నది. స్థలాన్ని ఆక్రమించే ఈ వ్యర్థాల ద్వారా దుర్వాసన రావడమే కాకుండా భూగర్భ జలాలు కలుషితం కావడం, విషవాయువులు వెలువడటం వంటి తీవ్రమైన పర్యావరణ సమస్యలు తలెత్తునున్నాయి.
