అస్సాం స్కూల్ పేలుళ్ల కేసు..ఆరుగురు విడుదల

అస్సాం స్కూల్ పేలుళ్ల కేసు..ఆరుగురు విడుదల

దిస్పూర్: 2004లో అస్సాం ధేమాజీలోని స్కూల్​లో జరిగిన బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి గౌహతి హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులోని ఆరుగురు దోషులను నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు వెలువరించింది. గతంలో  జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును  కొట్టివేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ధేమాజీలోని స్కూల్​పై  కొందరు బాంబులు విసిరారు. ఈ పేలుళ్లలో 13 మంది స్కూల్ విద్యార్థులతో సహా 18 మంది చనిపోయారు.

మరో 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుడుకు పాల్పడింది తామేనని యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం(ఉల్ఫా) ప్రకటించింది. పోలీసులు లీలా గొగోయ్, దీపాంజలి బురాగోహైన్, ముహి హండిక్, జతిన్ దోవారీ, ప్రశాంత్ భూయాన్, హేమెన్ గొగోయ్‌లను అరెస్ట్ చేశారు. వారిని దోషిగా తేల్చిన ధేమాజీ జిల్లా సెషన్స్ కోర్టు 2019లో శిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ దోషులు పిటిషన్ వేయగా డివిజన్ బెంచ్ గురువారం తీర్పుచెప్పింది.