అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. అర్ధాంతరంగా వెళ్లిపోయిన జేడీ వాన్స్ టీమ్

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. అర్ధాంతరంగా వెళ్లిపోయిన జేడీ వాన్స్ టీమ్

ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే దిశగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. దాదాపు 21 గంటల పాటు జరిగిన చర్చలు కొలిక్కిరాలేదు. యుద్ధ విరమణ విషయంలో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. అమెరికా డిమాండ్లను ఇరాన్ అంగీకరించలేదు. దీంతో యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వంలోని అమెరికా బృందం అర్ధాంతరంగా శాంతి చర్చలు ముగించి వెళ్లిపోయింది. 

చర్చల ముగింపు అనంతరం జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా డిమాండ్లను ఇరాన్ అంగీకరించడం లేదని చెప్పారు. దీంతో ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చల నుంచి వెనక్కి వచ్చామని తెలిపారు. ఒప్పందం కుదరకపోవడం చాలా చెడ్డ వార్త అని.. కానీ అమెరికా కంటే ఇరాన్‎కే ఇది ఎక్కువ బ్యాడ్ న్యూస్ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

చర్చలు సానుకూలంగా ఉన్నప్పటికీ.. అమెరికా, ఇరాన్‌ల మధ్య అనేక కీలక సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. అణ్వాయుధాలను సమకూర్చుకోబోమని ఇరాన్ స్పష్టమైన వాగ్దానం చేయాలని అమెరికా కోరుకుంటుందని తెలిపారు. అణ్వాయుధాలను తయారు చేయాలనే ఆలోచనను ఇరాన్ విరమించుకోవాలని, భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన చేయొద్దని అమెరికా ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యం కూడా ఇదేనని స్పష్టం చేశారు. చర్చల్లో ప్రధాన అంశం కూడా ఇదేనని.. కానీ ఇందుకు అంగీకరించలేదని తెలిపారు. చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో పాకిస్థాన్ వీడి తిరిగి అమెరికా వెళ్తున్నామని వాన్స్ పేర్కొన్నారు. ఇరాన్, అమెరికా చర్చలు విఫలం కావడంతో ట్రంప్ ఏం చేయబోతున్నారనే దానిపై ప్రపంచ దేశాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.