ఆర్టీసీ విలీనంపై గెజిట్..15వ తేదీతో రిలీజ్ చేసిన ప్రభుత్వం

ఆర్టీసీ విలీనంపై గెజిట్..15వ తేదీతో రిలీజ్ చేసిన ప్రభుత్వం
  • గైడ్ లైన్స్ పై త్వరలో  జీవోలు విడుదల
  •     పీఆర్సీలు, బకాయిలపై క్లారిటీ ఇవ్వాలంటున్న యూనియన్లు
  •     అధికారుల కమిటీలో చోటు కల్పించాలని డిమాండ్
  •     ఏపీలో ఇబ్బందులు ఇక్కడ రిపీట్ కావొద్దని వినతి

హైదరాబాద్, వెలుగు :  ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై గెజిట్ విడుదలైంది. ఈ నెల 15వ తేదీతో గవర్నర్ తరుఫున లా సెక్రటరీ తిరుపతి ఈ గెజిట్​ను రిలీజ్ చేయగా మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్ ఈ నెల 14న గవర్నర్ ఆమోదించారని, అందుకు అనుగుణంగా ఈ గెజిట్ జారీ చేసినట్లు లా సెక్రటరీ పేర్కొన్నారు. గెజిట్ కు అనుగుణంగా ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుందని, నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొన్న డేట్ నుంచి విలీనం అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చే ముందు రూల్స్, రెగ్యులేషన్స్, సర్వీస్ రూల్స్, పే స్కేల్స్, హోదాలు వంటివి ప్రభుత్వం త్వరలో ఖరారు చేయనుందని స్పష్టం చేశారు. ఫైనాన్స్ స్పెషల్ సీఎస్, ఆర్ అండ్ బీ, ట్రాన్స్ పోర్ట్ సెక్రటరీ  విధి విధానాలు, ఇతర గైడ్ లైన్స్ పై త్వరలో జీవో విడుదల చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఇందులో ఆర్టీసీ ఉద్యోగి క్యాడర్, సర్వీస్, సాలరీ, అలవెన్సులు, ప్రస్తుత హోదా ప్రభుత్వంలో విలీనం త్వరాత వచ్చే హోదా, సర్వీస్ కండీషన్లు, ఉద్యోగి కోడ్ ఆఫ్ కండక్ట్ వివరాలు ఉంటాయి.

కమిటీ నియమించాలే, యూనియన్ల ప్రతినిధి కమిటీలో ఉండాలే: జేఏసీ

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి, కన్వీనర్ హనుమంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు. విలీన  సమస్యల పరిష్కారం కోసం  కేబినెట్ నిర్ణయం వెల్లడించే టైమ్ లో ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ , ఇతర అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంత వరకు కమిటీ ఏర్పాటుపై జీవో లేదా అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఆర్సీ2, పీఆర్సీ1 బకాయిలు, సీసీఎస్, పీఎఫ్, ఎస్ ఆర్ బీఎస్, ఎస్ బీటీ స్కీమ్, రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్ మెంట్, డీఏ బకాయిలు, కారుణ్య నియామకాలు, ఆర్టీసీ అప్పులు తీర్చే వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని నేతలు గుర్తు చేశారు. ఈ అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ఆర్టీసీ యూనియన్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని, కమిటీ ఏర్పాటు చేస్తే యూనియన్ నేతలకు చోటు కల్పించారన్నారు. గెజిట్ విడుదల చేయటంపై ప్రభుత్వానికి అశ్వత్థామరెడ్డి, హనుమంతులు ధన్యవాదాలు తెలిపారు. కార్మికులకు నష్టం జరిగేలా ఆర్టీసీ విలీనం ఉంటే పోరాటాలు చేసేందుకు వెనుకాడబోమని ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ  రాజిరెడ్డి, ఎస్ డబ్ల్యూ ఎఫ్ జీఎస్ వీఎస్ రావులు తెలిపారు.  ప్రభుత్వం రూల్స్ ఖరారు చేయాలని, పీఆర్సీలు, డీఏ బకాయిలు, సీసీఎస్, పీఎఫ్ బకాయిలు,  ఉద్యోగ భద్రత, బకాయిలపై స్పష్టత ఇవ్వాలన్నారు. గెజిట్ ఇవ్వటంపై ఎన్ఎంయూ నేతలు కమాల్ రెడ్డి, నరేందర్, అశోక్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో తలెత్తిన ఇబ్బందులు ఇక్కడ రాకుండా రూల్స్ రూపొందించాలని నేతలు కోరారు.