ఇదెక్కడి వింత బ్రో.. వధూవరులు లేకుండానే వివాహం..!

ఇదెక్కడి వింత బ్రో.. వధూవరులు లేకుండానే వివాహం..!

లగ్గం అంటే.. ఇద్దరు మనుషుల కలయిక కాదు.. రెండు కుటుంబాలను దగ్గర చేసే వేడుక అంటుంటారు. బంధువులు, స్నేహితులందరి సమక్షంలో అంగరంగవైభవంగా వధూవరులకు పెండ్లి చేస్తారు. ఏ మతంలోనైనా పెండ్లి అంటే.. ఇలానే జరుగుతుంది. కానీ, పెండ్లి అనే మాటకు రానురాను అర్థాలు మారిపోతు న్నాయి. వధూవరులు ఒకచోట లేకుండా ఆన్​లైన్​ వివాహాలు జరగడం చూశాం. 

అవే వింత​ అనుకుంటే ఓ దేశంలో సోలో వెడ్డింగ్​ అంటూ అందర్నీ అవాక్కయ్యేలా చేశాయి కొన్ని వార్తలు. ఇప్పుడు అంతకుమించి.. అంటోంది ట్రెండ్​ క్రియేట్ చేయడంలో వెరీ ఫాస్ట్​గా ఉన్న జెన్​ జీ​ యూత్​. అసలు పెండ్లికూతురు, పెండ్లి కొడుకు లేకుండానే వెడ్డింగ్​ పార్టీ చేసుకోవచ్చు! అంటూ సెలబ్రేట్‌ చేసుకున్న వీడియోలు సోషల్​ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇదే ఆ జెన్​ జీల పెళ్లి గోల!

జనరేషన్​ జెడ్​ యూత్​కి పెండ్లి, రిలేషన్​షిప్‌‌‌‌‌‌‌‌​ల మీద రకరకాల అభిప్రాయాలున్నాయి. వాళ్లకు కరెక్ట్​ అనిపించింది చేసుకుంటూ పోతున్నారు. పెండ్లి విషయంలోనూ అంతే..! అసలు కథ పెండ్లి గురించి కాదు.. పార్టీ గురించి. స్కూల్లో ఫేర్​వెల్ పార్టీతో మొదలు.. కాలేజీలో  చేరిన వెంటనే ఒక పార్టీ.. చదువు పూర్తయ్యాక మరొక పార్టీ. ఇవి కాకుండా మధ్యమధ్యలో బర్త్​ డేలు, పండుగలు, యానివర్సరీలకు పార్టీలు చేసుకుంటుంటారు.

ఆఫీస్​లకు వెళ్లాక అక్కడ రకరకాల పార్టీలు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఫ్యామిలీ గెట్​ టు గెదర్స్​ మామూలే. ఇవన్నీ ఒక ఎత్తయితే.. పబ్​లు, క్లబ్​లు.. యూత్ పార్టీలకు అడ్డాగా మారాయి. అంతటితో ఆగలేదు కదా.. థీమ్​ పార్టీలు అంటూ కొత్త ఒరవడి మొదలుపెట్టారు. ఇలాంటి తరుణంలో పార్టీ చేసుకోవడానికి మరో కొత్త థీమ్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది జెన్​ జీ. అదే ఫేక్​ వెడ్డింగ్ ట్రెండ్​. వీటినే మాక్​ వెడ్డింగ్​ అని కూడా అంటారు. 

ఈ ఫేక్ వెడ్డింగ్​లు సెలబ్రేట్ చేసుకునేవాళ్లు ఒక గ్రూప్​గా ఏర్పడి.. అందరూ కలిసి డబ్బు పోగుచేసుకుంటారు. ఒక డేట్​ నిర్ణయించుకుని ఫంక్షన్ హాల్ మాట్లాడుకుంటారు. ఈ నకిలీ పెండ్లిలో జరిగే ఈవెంట్స్​తో కార్డ్​లు కూడా అచ్చు వేయిస్తారు. మండపం, తోరణాలు, పసుపు పూసుకోవడం, చేతులకు మెహందీ పెట్టుకోవడం, సంగీత్​లో డాన్స్ చేయడానికి రిహార్సల్స్ చేయడం, విందు భోజనాలు.. ఒకటా రెండా పెండ్లి అంటే ఏమేం జరగాలో దాదాపు అన్నీ ఉంటాయి. ఆడవాళ్లు పట్టు చీరలు, ఓణీలు, లెహంగాలు ధరిస్తే.. మగవాళ్లు కూడా అందుకు తగ్గట్లే పంచెకట్టు, కుర్తా పైజామా, సూటు​ బూటు వంటివి వేసుకుంటారు.

 అతిథులంతా ఉత్సాహంగా డాన్స్ చేస్తారు. పెండ్లిలో బంధువుల హడావిడి కూడా ఉంటుంది. తంతు జరిపించేందుకు ఒక పంతులు కూడా ఉంటాడు. కానీ, లగ్గం మాత్రం జరగదు. ఎందుకంటే ఇది పెండ్లి కాదు కాబట్టి! ఇది పెండ్లిలా కనిపించే ఒక ట్రెడిషనల్ వెడ్డింగ్​ థీమ్​ పార్టీ. ఈ వేడుకలో వధూవరులు ఉండరు. వధూవరులు లేకపోతే అది వివాహం ఎలా అవుతుంది? అంటారేమో.. అందుకే దీన్ని ఫేక్ వెడ్డింగ్.. నకిలీ పెండ్లి అంటున్నారు. ఈ పెండ్లి కాని పెండ్లి వేడుకలకు మెట్రో సిటీలు కేరాఫ్​గా మారుతున్నాయి.

 వీటిని ఈవెంట్ కంపెనీలు కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి. బిజినెస్​ పరంగా పార్టీని హోస్ట్ చేసే ఈవెంట్ ఆర్గనైజర్స్​కు, అందులో పనిచేసే విభాగాలకు ఆదాయమార్గంగా కనిపించొచ్చు. ఫంక్షన్లు, పెండ్లిళ్లు వంటి శుభకార్యాలు సీజన్​లో మాత్రమే ఉంటాయి. కాబట్టి ఫంక్షన్​ హాల్స్​కు ఇవి లాభదాయకం. అయితే ఈ ఫేక్​ వెడ్డింగ్​లను ఫంక్షన్​ హాల్స్​లోనే కాదు.. ఎక్కడ వీలైతే అక్కడ సెలబ్రేట్​ చేసుకుంటున్నారు. 

పెండ్లికి వెళ్లాలంటే టికెట్ కొనాలి!

ఇదో రకం పెండ్లి వేడుక. ఇక్కడ నిజంగానే పెండ్లి జరుగుతుంది కానీ, వెడ్డింగ్​కి వచ్చే గెస్ట్​లు టికెట్​ కొనుక్కుని హాజరవ్వాలి. ది గార్డియన్ న్యూస్ ప్రకారం.. ఈ ట్రెండ్​కి నాంది పలికింది కటియా లెకర్స్కీ. ఆమె ఇన్విటిన్​ అనే కంపెనీ వ్యవస్థాపకురాలు. ఈ ఏడాది మొదట్లో ఆమె ఈ ఆలోచనను ప్రపంచానికి పరిచయం చేసింది. దీని వెనక ఓ చిన్న కథ ఉంది. లెకర్స్కీ దక్షిణ ఫ్రాన్స్​లో ఉన్న తన ఇంటిని వెడ్డింగ్ గెస్ట్​ల కోసం రెంట్​కి ఇచ్చింది. పెండ్లికి వచ్చిన అతిథులు అక్కడ బస చేశారు.

 తర్వాత పెండ్లి జరిగే ప్రదేశానికి వెళ్లిపోయేవారు. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉండేది. ఇదంతా గమనిస్తున్న లెకర్స్కీ ఐదేండ్ల కూతురు ‘అదేంటమ్మా.. వాళ్లు మనల్ని పెండ్లిళ్లకు ఇన్వైట్ చేయట్లేదు’ అని ఆశ్చర్యంగా అడిగింది. కూతురు వేసిన ప్రశ్న ఆ తల్లి మదిలో కొత్త ఆలోచనను రేకెత్తించింది. అదే ‘‘పెండ్లికి వచ్చేవాళ్లంతా టికెట్​ కొంటే వధూవరులకు ఆర్థికంగా సాయపడినవాళ్లు అవుతారు కదా! ఈ ఆధునిక ప్రపంచంలో డేటింగ్ యాప్స్, తెలియని వాళ్లతో కలిసి విందులు, వినోదాలు ఎంజాయ్ చేయడం కోసం డబ్బు ఖర్చు చేసి టికెట్లు కొంటున్నారు. 

అలాంటప్పుడు అంత ఖర్చుతో వైభవంగా పెండ్లి చేస్తున్నప్పుడు వచ్చే అతిథులు టికెట్​ కొనడంలో తప్పేంటి?” అని. ఈ ఆలోచన రావడంతోనే వెడ్డింగ్ ఎలా ఉండాలి అనే థీమ్​ కూడా డిజైన్ చేసింది. దాదాపు పది నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు చేయొచ్చు అని అంచనా వేసింది. సాధారణంగా పెండ్లి అంటేనే ఒక రోజంతా పండగ వాతావరణం ఉంటుంది. కాబట్టి తప్పులేదు అనుకుంది. కాకపోతే డ్రెస్ కోడ్ కంపల్సరీ. ఈ ఆలోచన నచ్చడంతో యూరప్ ప్రజలు ట్రెండ్​ని బాగా ఫాలో అవుతున్నారు. ఇప్పటికే ఆరు వెడ్డింగ్స్​ బుకింగ్స్ అయ్యాయని ఆమె చెప్పారు. 

ఇప్పుడు ఇదే ట్రెండ్​ ఇండియాలోకి వచ్చేసింది. ‘జాయిన్​ మై వెడ్డింగ్’ అనే స్టార్టప్​ కంపెనీ వాళ్ల వెబ్​సైట్​లో ఈ వెడ్డింగ్స్​ గురించి పూర్తి వివరాలు ఇచ్చింది. అందులో దేశవ్యాప్తంగా జరుగుతున్న పెండ్లిళ్ల లిస్ట్ ఉంది. ఆ పెండ్లిళ్లలో పాల్గొనడానికి టికెట్ రేటు రూ.13 వేల నుంచి మొదలవుతున్నట్టు పేర్కొంది. ఎన్నిరోజులు జరిగినా అదే అమౌంట్​ అని చెప్పింది. వచ్చిన మొత్తాన్ని పెండ్లి చేసుకునే జంటకు ఇస్తామని చెప్పింది. 

అసలు ఇదంతా ఎందుకు.. 

అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే.. దూరంగా ఉండడం వల్ల పెండ్లిళ్లకు వెళ్లలేనివాళ్లు, సెలవు దొరకని వాళ్లు, పెండ్లి ఎలా జరుగుతుందో తెలియనివాళ్లు.. ఇలా రకరకాల మనుషులు వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. మన ఇండియన్ వెడ్డింగ్​లో కల్చర్, ట్రెడిషన్​కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ప్రస్తుతం స్టూడెంట్స్ చదువుకోవడానికి దూరప్రాంతాలకు వెళ్తున్నారు. అలాంటివాళ్లకు మన కల్చర్ దూరం కాకుండా, అందరితో కలిసేలా ఇలాంటి సంప్రదాయబద్ధమైన వేడుకలు దోహదపడతాయి అని కొందరు అంటున్నారు. 

అయితే, మరోవైపు.. వివాహం విలువ ఈ కాలం పిల్లలకు తెలియడం లేదు. ఇదొక సెలబ్రేషన్​ అనుకుంటున్నారు అంటూ రకరరాల కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నకిలీ పెండ్లిళ్లు సినిమాల్లో చూపించినట్టు గ్రాండ్​గా చేస్తున్నారు. కానీ, అసలు పెండ్లి గురించి అర్థమయ్యేలా చెప్పాలంటే.. సినిమా పాటలు, సన్నివేశాలు చాలు. ‘కొత్తొక వింత..’అనుకుంటున్నారేమో కానీ కాస్త ఆలోచించేవాళ్లకు ఈ ట్రెండ్​ విడ్డూరంగానే అనిపిస్తుంది. ఇది కూడా అన్ని ట్రెండ్​లలానే ఏదో ఒకరోజు కనుమరుగైపోతుందని ఇంకొందరు అంటున్నారు.