మారణహోమం సృష్టిస్తున్న వైరస్​లు

మారణహోమం సృష్టిస్తున్న వైరస్​లు

ఎండాకాలం సమీపిస్తున్న ప్రస్తుత సమయంలో  దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు జలుబు, దగ్గు, వైరల్‌‌‌‌‌‌‌‌ జ్వరాల బారినపడటం కలవరపెడుతోంది. గత దశాబ్ద కాలంలో అనేక వైరస్ లు జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందాయి. దీంతో ప్రపంచంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  వివిధ వ్యాధుల ద్వారా వైరస్‌‌‌‌‌‌‌‌లు సృష్టించిన మారణహోమం ఏ మహా సంగ్రామానికీ తక్కువ కాదు. మశూచి దాదాపు మూడు వేల సంవత్సరాలుగా మనలో ఉంది. ఇది ఒక్క 20వ శతాబ్దంలోనే 30 కోట్ల మందిని బలిగొంది. ఇక, ఎయిడ్స్‌‌‌‌‌‌‌‌ నలభైయేండ్లలో 3.7 కోట్ల ప్రాణాల్ని బలి తీసుకుంది. కరోనా లక్షల మందిని పొట్టనపెట్టుకుంది.  ప్రపంచంలోనే అన్ని దేశాలు కరోనా మహమ్మారి బారినపడి విలవిలలాడాయి. పశ్చిమ ఆఫ్రికాలో 2014-–16 మధ్య ఎబోలా వ్యాప్తికి కారణమైన వైరస్ సోకినవారిలో 90% మంది మరణించారు.

వైరస్ అంటే..

వైరస్ అనే పదము లాటిన్ భాష నుంచి ఉద్భవించింది. లాటిన్‌‌‌‌‌‌‌‌లో వైరస్ అంటే టాక్సిన్ లేదా విషం అని అర్థం. వైరస్‌‌‌‌‌‌‌‌లు అతి సూక్ష్మమైనవి (సుమారుగా 15,-600 నానోమీటర్లు). ఇవి ఇతర జీవులపై దాడిచేసి వ్యాధులను కలుగజేస్తాయి. ఈ దాడి ముఖ్య ఉద్దేశ్యం వైరస్‌‌‌‌‌‌‌‌ల సంతతిని పెంచుకోవడం. వైరస్‌‌‌‌‌‌‌‌లు మన శరీరాల్లోకి ఎందుకొస్తాయి అంటే అవి ఒంటరిగా జీవించలేని పరాన్నభుక్కులు. కాబట్టి మనుషులు, జంతువులు, మొక్కలు, బ్యాక్టీరియా ఇలా వాటికి ఏదో ఒక ఆశ్రయం కావాలి.  ఆశ్రయం పొంది  శరీరంలో వ్యాధులు తెచ్చే మహమ్మారిగా మారుతున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల కోడ్‌‌‌‌‌‌‌‌లో వైరస్​లను సూక్ష్మజీవులుగా (మైక్రోఆర్గనిజమ్స్‌‌‌‌‌‌‌‌గా) పరిగణించారు.

 కానీ, శాస్త్రజ్ఞులలో వాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. జీవులకిచ్చిన నిర్వచనం వీటికి ఖచ్చితంగా వర్తించకపోవడంతో చాలామంది వైరాలజిస్ట్‌‌‌‌‌‌‌‌లు వైరస్‌‌‌‌‌‌‌‌లు నిర్జీవులనే భావిస్తారు. ఉదాహరణకు సజీవులు చలించినట్టు వైరస్‌‌‌‌‌‌‌‌లు ప్రకృతిలో కలిగే మార్పులకు చలించవు. వైరస్‌‌‌‌‌‌‌‌లలో, జీవుల్లో ఉండే అతి ప్రాథమిక నిర్మాణమైన కణనిర్మాణం లేదు. దీనికి తోడు ఇవి విభజన చెందినా కూడా వాటంతట అవి మెటబాలిజమ్ చేసుకోలేవు. విభజనకు ఇతర జీవకణాలపై ఆధారపడతాయి. ఇవి జన్యుపదార్థాన్ని కలిగి ఉండడం,  ప్రత్యుత్పత్తిని జరుపుకోవడం వైరస్‌‌‌‌‌‌‌‌లకు ఇతర జీవులకు ఉండే ముఖ్యమైన పోలికలు. కానీ, ఒకవేళ వైరస్‌‌‌‌‌‌‌‌లను సజీవులుగా ఒప్పుకుంటే జీవం అన్నమాటకు నిర్వచనం మార్చవలసి రావచ్చు.

కోట్లాది వైరస్​లు

ఈ విశ్వంలో మొత్తం 10 నానిలియన్‌‌‌‌‌‌‌‌ల (అంటే 10 తర్వాత 31 సున్నాలు) వైరస్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయని అంచనా. ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటినీ పరిగణనలోకి తీసుకున్నా కూడా ఈ సంఖ్య రెండు రెట్లు ఎక్కువ. ఇక మన శరీరంలోనైతే 32 లక్షల కోట్ల వైరస్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అతి ప్రమాదకరమైన 12 వైరస్ వ్యాధులను గుర్తించారు. అవి ఒకరికి సోకినట్లయితే వారి నుంచి మరో వ్యక్తికి సోకి  ప్రాణాపాయం  ముప్పు  ఆధారంగా పేర్కొన్న వైరస్ లు.  అవి ప్రధానంగా మార్బబర్గ్ వైరస్, ఎబోలా వైరస్, రాబిస్, హెచ్ఐవి, మశూచి, హంటావైరస్, డెంగ్యూ, రోటవైరస్, సార్స్ -కోవ్ 1,2 లు , మెర్స్ -కోవ్.  వైరస్​ల వల్ల మనుషుల్లో వచ్చే సాధారణ వ్యాధులు జలుబు, ఫ్లూ, మశూచి, చికెన్ పాక్స్, చికున్ గున్యా, డెంగూ జ్యరం ముఖ్యమైనవి.

 ప్రాణాంతకమైన ఎబోలా, ఎయిడ్స్, ఏవియన్ ఫ్లూ, రేబిస్, వైరల్ హెపటైటిస్, జపనీస్ ఎన్సెఫలైటిస్, సార్స్ వైరస్ ద్వారానే కలుగుతాయి.  ఒకవైపు కరోనా వైరస్ విధ్వంసం ఇంకా పూర్తిగా ముగియలేదు. అదే సమయంలో, హెచ్ 3, ఎన్2 వైరస్ లు వచ్చాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మంకీ పాక్స్, హెపటైటిస్, టొమాటో ఫ్లూ చాలా దేశాలలో వ్యాప్తి చెందుతున్నాయి. ప్రస్తుతానికి కరోనా తీవ్రత తగ్గినా భవిష్యత్తులో మరిన్ని వైరస్ లు దాడి చేసే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు వైరస్ లపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది.

-  పిన్నింటి బాలాజీ రావు,భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుడు