జియోట్యాగ్‌‌‌‌‌‌‌‌లో నిర్లక్ష్యం.. ఉపాధి ఫండ్స్‌‌‌‌‌‌‌‌ ఆలస్యం

జియోట్యాగ్‌‌‌‌‌‌‌‌లో నిర్లక్ష్యం.. ఉపాధి ఫండ్స్‌‌‌‌‌‌‌‌ ఆలస్యం
  • పనుల్లో పారదర్శకత కోసం జియోట్యాగ్‌‌‌‌‌‌‌‌ విధానం అమలుచేస్తున్న కేంద్రం
  • రాష్ట్రంలో 4.31 లక్షల పనుల‌‌‌‌‌‌‌‌కుగానూ 1.12  లక్షల పనులు జియోట్యాగ్ ​కాలే 
  • రాష్ట్రంలో సుమారు రూ. 321 కోట్ల మెటీరియల్‌‌‌‌‌‌‌‌ బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌

హైద‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో ఉపాధి హామీ స్కీమ్‌‌‌‌‌‌‌‌ పనుల నిర్వహణలో క్షేత్రస్థాయి ఆఫీసర్ల నిర్లక్ష్యం నిధుల విడుదలకు అడ్డంకిగా మారుతోంది. ఉపాధి హామీ నిధుల్లో అక్రమాలకు తావు లేకుండా, పనులు వాస్తవంగా జరిగాయో లేదో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జియో ట్యాగ్‌‌‌‌‌‌‌‌ విధానాన్ని అమ‌‌‌‌‌‌‌‌ల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాష్ట్రంలో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. పనులు పూర్తి చేసి, వాటి వివరాలను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేస్తేనే నిధులు విడుదలయ్యే  అవకాశం ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ స్కీమ్ కింద ఇప్పటివరకు చేపట్టిన 4.31 లక్షల ప‌‌‌‌‌‌‌‌నుల్లో 3 ల‌‌‌‌‌‌‌‌క్షల ప‌‌‌‌‌‌‌‌నులు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ చేయ‌‌‌‌‌‌‌‌గా.. 1,12,094 ప‌‌‌‌‌‌‌‌నుల‌‌‌‌‌‌‌‌కు ఇంకా జియోట్యాగ్‌‌‌‌‌‌‌‌ పూర్తి కాలేదు. సుమారు 26 శాతం పనులు  ఇంకా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ రికార్డుల్లోకి ఎక్కలేదు. మొత్తం పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పనులలో 97,060 పనులకు సంబంధించి.. 61 రోజులుగా ఎటువంటి పురోగతి లేదు.

పని పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా..  ఆ ప‌‌‌‌‌‌‌‌నులు ఎక్కడ జరిగాయో ఫొటో తీసి వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో పెట్టకపోవడంపై ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు రూ. 321 కోట్ల మెటీరియల్‌‌‌‌‌‌‌‌ బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. నిబంధనల ప్రకారం.. పని ప్రారంభం నుంచి ముగింపు వరకు మూడు దశల్లో ఫొటోలు తీసి అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాలి. కానీ, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ ప్రక్రియ అనుకున్నంత‌‌‌‌‌‌‌‌గా ముందుకెళ్లడం లేదు.

ట్యాగింగ్‌‌‌‌‌‌‌‌ లేకపోతే నిధుల నిలిపివేతే..

కేంద్రం నుంచి నిధులు రావాలన్నా, మెటీరియల్‌‌‌‌‌‌‌‌ బిల్లులు చెల్లించాలన్నా ఆ పనికి సంబంధించిన జియో ట్యాగింగ్ ఫొటోలు తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్తి చేయకుండా బిల్లులు పంపితే నిధులు నిలిచిపోయే చాన్స్ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో రూ. 321 కోట్ల మెటీరియల్‌‌‌‌‌‌‌‌ బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉండగా.. జియో ట్యాగింగ్‌‌‌‌‌‌‌‌లో జాప్యం జరిగితే ఆ బకాయిలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన నమోదు చేయాలని పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌ శాఖ జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించింది.

నల్గొండ జిల్లాలో అత్యధికంగా రూ. 31.80 కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో రూ. 24.71 కోట్లు, సిద్దిపేట జిల్లాలో రూ. 21.34 కోట్లు నిధులు పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు.. మంజూరై ఇంకా ప్రారంభం కాని పనుల మెటీరియల్ ఎంటిటిల్‌‌‌‌‌‌‌‌మెంట్ విలువ ఏకంగా రూ. 503.30 కోట్లు ఉండటం గమనార్హం. మెటీరియల్ నిధుల చెల్లింపుల్లో గ్రామ పంచాయతీ భవనాలు, వైకుంఠధామాలు, స్కూల్ టాయిలెట్లు, కాంపౌండ్ వాల్స్ వంటి పనులు ఉన్నాయి.

అత్యధికంగా  పంచాయ‌‌‌‌‌‌‌‌తీ భవనాల‌‌‌‌‌‌‌‌కు రూ. 117.85 కోట్లు నిలిచిపోయాయి. కాంపౌండ్ వాల్స్ కు  రూ. 62.81 కోట్లు, అంగన్వాడీ కేంద్రాల‌‌‌‌‌‌‌‌కు రూ. 40.65 కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లోఉన్నాయి. ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తున్నా.. క్షేత్రస్థాయిలో జియో ట్యాగింగ్ ప్రక్రియ వేగవంతం కాకపోవడంపై ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తక్షణమే ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే నిధులు ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. క్షేత్రస్థాయిలో ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, నిధులు సకాలంలో అందకపోవడంతో క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు మందగిస్తున్నాయి.