అమెరికాలోని భారతీయ ఫ్యామిలీలో ఘోరం : పెళ్లాన్ని, 3 బంధువులను కాల్చి చంపిన భర్త

అమెరికాలోని భారతీయ ఫ్యామిలీలో ఘోరం : పెళ్లాన్ని, 3 బంధువులను కాల్చి చంపిన భర్త

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన ఒక భయంకరమైన సామూహిక హత్యలు ప్రవాస భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అట్లాంటా సమీపంలోని లారెన్స్‌విల్ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం పెను విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఒక భారతీయ మహిళతో పాటు ఆమె ముగ్గురు బంధువులను అత్యంత కిరాతకంగా భర్త కాల్చి చంపటం ప్రస్తుతం సెన్సెషనల్ అయ్యింది. 

భర్త ఇలా కిరాతకంగా ప్రవర్తించటానికి కుటుంబ కలహాలే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిలో మీము డోగ్రా, గౌరవ్ కుమార్, నిధి చందర్, హరీష్ చందర్ ఉన్నారు. నిందితుడు విజయ్ కుమార్ తన భార్యతో సహా మిగిలిన ముగ్గురిని బలితీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురుస్తున్న సమయంలో ముగ్గురు చిన్నపిల్లలు ప్రాణ భయంతో అల్లాడిపోయారు. తమ ప్రాణాలను తండ్రి నుంచి కాపాడుకునేందుకు ఆ చిన్నారులు ఇంట్లోని ఒక అల్మారాలో దాక్కున్నారు. బయట తుపాకీ పేలుళ్లు, చుట్టాల అరుపులు వినిపిస్తున్నా బిక్కుబిక్కు మంటూ శ్వాస బిగబట్టి దాక్కున్నారు. 

అయితే కొద్దిసేపరిటి తర్వాత ఆ చిన్నారుల్లో ఒకరు అర్థరాత్రి 2గంటల 30 నిమిషాల సమయంలో అత్యంత సాహసంతో ఎమర్జెన్సీ నంబర్ 911 కి కాల్ చేయడంతో పోలీసులు నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చే సమయానికి నలుగురు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉండగా.. ఆ ముగ్గురు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. 

బాధితుల్లో ఒకరు భారతీయ పౌరురాలు కావడంతో.. బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. నిందితుడు విజయ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై హత్య, హత్యా యత్నం, పిల్లల పట్ల క్రూరంగా ప్రవర్తించడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ ముగ్గురు చిన్నారులను వారి బంధువుల సంరక్షణలో ఉంచారు.