కూతురి కోసం ఉన్నదంతా ఖర్చు.. తెల్లారి లాటరీలో రూ. 16 కోట్లు

కూతురి కోసం ఉన్నదంతా ఖర్చు.. తెల్లారి లాటరీలో రూ. 16 కోట్లు

సాయం చేసిన వాడికి..దేవుడు ఏదో విధంగా న్యాయం చేస్తాడు అనే విషయం ఓ మహిళ విషయంలో నిరూపించబడింది. కూతురికి వైద్యం చేయించేందుకు తన జీవిత కాలంలో సంపాదించిన  డబ్బు మొత్తాన్ని ఖర్చు చేసిన తల్లి..లాటరీలో ఏకంగా రూ. 16 కోట్లు గెలుచుకుంది.   అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ ఘటన వెలుగు చూసింది.

ఉన్నదంతా ఇచ్చేసింది..

అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని లేక్‌ల్యాండ్ లో గెరాల్డిన్ గింబ్లెట్‌ అనే మహిళ నివాసముంటోంది. ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఒక రోజు  ఉపద్రవం వచ్చింది. తన కూతురు అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. పలు పరీక్షలు చేసిన తర్వాత  గెరాల్డిన్ గింబ్లెట్‌ కూతురుకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ సోకినట్లు డాక్టర్లు నిర్థారించారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన గింబ్లెట్.. ఎలాగైనా సరే కూతురిని బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కాపాడాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తాను కూడబెట్టిన డబ్బునంతా ఖర్చు చేసి మంచి వైద్యం అందించింది. చికిత్స తర్వాత గింబ్లెట్ కూతురు బ్రెస్ట్ క్యాన్సర్‌ నుంచి బయటపడింది.

ఆర్థిక ఇబ్బందులు..

కూతురు చికిత్స కోసం సంపాదించిన డబ్బునంతా ఖర్చు చేసేయడంతో గింబ్లెట్  ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది. రోజు గడవడమే ఇబ్బందిగా మారింది. అయితే ఓ రోజు అనుకోకుండా లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. లక్కీగా ఆ లాటరీకి 20 లక్షల డాలర్ల క్యాష్‌ప్రైజ్‌ (రూ. 16 కోట్లు) దక్కింది. దీంతో ఆ తల్లీకూతుళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

చివరి టికెట్తో కోట్లు..

గెరాల్డిన్‌ లేక్‌ల్యాండ్‌లోని ఓ దుకాణంలో  లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. దీని ధర 10 డాలర్లు .. అంటే మన కరెన్సీలో 821 రూపాయలు. అయితే మొదట లాటరీ టికెట్లన్నీ అయిపోయానని దుకాణం వ్యక్తి చెప్పగా..తనకు లాటరీ  గేమ్స్‌ అంటే  ఇష్టమని..మరోసారి వెతకమని దుకాణం యజమానిని కోరింది. ఆ సమయంలో అతడు స్టోర్‌ మొత్తం వెతికి చివరి టికెట్‌ను గింబ్లెట్ కు ఇచ్చాడు. ఆ చివరి టికెటే గింబ్లెట్ కు కోట్లు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం లాటరీ ద్వారా రూ. 16 కోట్లు గెలుచుకున్న గింబ్లెట్..టాక్సులు పోను... 13.5 కోట్లు అందుకుంది. 

ఆనంద భాష్పాలు..

లాటరీలో గెలుచుకున్న మొత్తాన్ని గెరాల్డిన్‌ తన కూతురు, మనవరాలితో కలిసి అందుకుంది.  ఈ సందర్భంగా గెరాల్డిన్‌ కూతురు కంటతడి పెట్టింది. అమ్మ లాటరీ టికెట్‌ కొనడానికి ముందు రోజే తనకు బ్రెస్ట్ క్యాన్సర్‌ కు చికిత్స జరిగిందని...ఇందు కోసం ఆమె దాచుకున్న డబ్బుంతా ఖర్చు పెట్టేసిందని వెల్లడించింది. ఆ తర్వాత అమ్మ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో..అదృష్టం కలిసివచ్చి లాటరీ తగిలిందంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

లాటరీ సంస్థ ఏది...

ఫ్లోరిడా లాటరీ సంస్థ 1988 నుంచి ఈ లాటరీ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు  3500 మందిని ఈ లాటరీ సంస్థ  కోటీశ్వరులను చేసింది. ఈ లాటరీలో భాగంగా గెరాల్డిన్‌తో పాటు లాటరీ అమ్మిన దుకాణం యజమానికి కూడా  2 వేల డాలర్ల బహుమతి దక్కడం విశేషం.