పోటీ పరీక్షలకు సిద్ధంకండి.. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం: సీఎం రేవంత్

పోటీ పరీక్షలకు సిద్ధంకండి.. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం: సీఎం రేవంత్

హైదరాబాద్: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని.. త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని చెప్పారు. పంచాయితీ ఎన్నికల కోసం చదువుకున్న యువత సమయం వృధా చేసుకోవద్దని సూచించారు. రాజకీయాలు ఎప్పుడైనా చేయొచ్చని.. వయో పరిమితి దాటితే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అవుతారని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించుకోవాలని.. చదువుకుంటేనే మీ పిల్లలు..కుటుంబాలు బాగుపడతాయని అన్నారు. 

ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా శుక్రవారం (డిసెంబర్ 05) వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రూ.508 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. వరంగల్ పర్యటనకు వస్తే స్ఫూర్తి కలుగుతుందన్నారు. పోరాట యోధుల స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్నామని.. కానీ గత పాలకులు ఫామ్ హౌస్‎లు నిర్మించుకున్నరు.. కార్లు కొన్నారు.. పదేండ్లు పాలించిన వాళ్లే ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు. 

ఈ ప్రాంత ప్రజలకు పదేండ్లలో ఏమీ రాలేదన్నారు. వరి వేస్తే ఉరి అని ఆనాడు కేసీఆర్ అన్నారు.. కానీ మేం సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నామని తెలిపారు. దుక్కిదున్నే ప్రతి రైతుకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని.. ఉచిత కరెంట్ పేటెంట్ హక్కు కాంగ్రెస్‎దేనని స్పష్టం చేశారు. రెండేండ్ల క్రితం గడీలను కూల్చి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని.. పదేండ్లు దోచుకున్న వారి గడీలకు కరెంటు పీకేశామన్నారు. 

2026, మార్చి 31లోపు వరంగల్ ఎయిర్ పోర్టు పనులు స్టార్ట్ చేస్తామని తెలిపారు. ఈ నెలాఖరు (డిసెంబర్)లోపు మమునూరు ఎయిర్ పోర్టు భూసేకరణ పూర్తి అవుతుందని చెప్పారు. పదేళ్లలో కేసీఆర్ ఒక్కరోజైనా వరంగల్ ఎయిర్ పోర్టు గురించి ఆలోచించాడా అని ప్రశ్నించారు. విదేశాలలో చదువుకున్నామని పొడుగుపోడుగు మాటలు చెప్పే వాళ్లకు తెలంగాణలో రెండవ ఎయిర్ పోర్టు తేవాలనే సోయి ఎందుకు లేదని నిలదీశారు. హైదరాబాద్‎లో ఏం ఉంటే అవన్నీ వరంగల్‎లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరంగల్‎ను హైదరాబాద్‎కు ధీటుగా తీర్చిదిద్దుతామని చెప్పారు.