Idupu Kayitham: ఎందుకురా ఓర్వలేని తనం.. అర్థం కాకపోతే మూసుకోండి.. ‘ఇడుపు కాయితం’ ట్రోల్స్‌కు ఘంటా ఘాటు రిప్లై

Idupu Kayitham: ఎందుకురా ఓర్వలేని తనం.. అర్థం కాకపోతే మూసుకోండి.. ‘ఇడుపు కాయితం’ ట్రోల్స్‌కు ఘంటా ఘాటు రిప్లై

టాలీవుడ్ నటుడు ప్రియదర్శి హీరోగా, తెలంగాణ ఫోక్ డాన్సర్ నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురువారం జూన్ 25న ప్రారంభమైంది. అయితే సినిమా టైటిల్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఈ టైటిల్‌పై ఆంధ్రా, తెలంగాణ నెటిజన్ల మధ్య సోషల్ మీడియాలో సరదా చర్చలు, సెటైర్లు కొనసాగుతున్నాయి. కొందరు ఆంధ్రా నెటిజన్లు టైటిల్ అర్థం కావడం లేదని.. ‘సినిమాకు తెలుగు డబ్బింగ్ ఉంటే చూస్తాం’ అంటూ కామెంట్లు చేస్తుండగా, తెలంగాణ నెటిజన్లు ప్రాంతీయ భాషా వైవిధ్యాన్ని గౌరవించాలని సూచిస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే  ‘ఇడుపు కాయితం’ టైటిల్పై వస్తున్న విమర్శకులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఘాటుగా స్పందించారు. ఆయన X వేదికగా స్పందిస్తూ..‘‘ఇడుపు కాయితం పేరులో, భావంలో స్పష్టత ఉంది. విడిపోయే కాగితం అని. విడిపోయేటప్పుడు రాసుకునే ఒక పత్రమది. ఎందుకురా ఇంత ఓర్వలేని తనం. మరి “విడాకులు” లో ఏముందిరా! ఆకులా? అర్థంకాకపోతే మూసుకోండి. సబ్ టైటిల్స్ ఉండవు. చూడకండి!’’ అని ఆంధ్రా నెటిజన్లకు గట్టి బదులిచ్చారు.

ప్రస్తుతం ఘంటా చక్రపాణి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకులు లేదా ప్రముఖుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందా అనే ఆసక్తి నెలకొంది.

ఒకప్పుడు తెలంగాణ యాసను సినిమాల్లో హాస్యానికి, విలన్ల పాత్రలకు మాత్రమే పరిమితం చేశారని, ఇప్పుడు‘ఫిదా’, ‘బలగం’, ‘దసరా’ వంటి చిత్రాలు తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాయని తెలంగాణ ప్రజలు గుర్తు చేస్తున్నారు. మరోవైపు, ఈ సినిమా టైటిల్ చుట్టూ ఏర్పడిన చర్చ మాత్రం చిత్రానికి మంచి పబ్లిసిటీని తీసుకొచ్చిందని సినీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 

ప్రతి ఇంటి కథ..

తెలంగాణ వాడుక భాషలో ‘ఇడుపు కాయితం’ అంటే ‘విడాకుల పత్రం’ అని అర్థం. పూర్వకాలంలో భార్యాభర్తలు విడిపోవాలనుకుంటే ఊరి పెద్దల సమక్షంలో రాసుకునే ఒప్పంద పత్రమే ఇది. ఇలా టైటిల్ ప్రకటనతోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈచిత్రాన్ని టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌసెస్ సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. మరి ఈ  ‘విడాకుల పత్రం’ వెనుక దర్శకుడు ఎలాంటి భావోద్వేగ కథను దాచారో తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.