గ‌త‌వారం కూతుర్ని చంపిన భార్య స్నేహితుడు.. మ‌నోవేద‌న‌తో తండ్రి ఆత్మ‌హ‌త్య‌

గ‌త‌వారం కూతుర్ని చంపిన భార్య స్నేహితుడు.. మ‌నోవేద‌న‌తో తండ్రి ఆత్మ‌హ‌త్య‌

వివాహిత మ‌హిళ భ‌ర్త‌కు తెలియ‌కుండా నడిపిన‌ బ‌య‌టి ప‌రిచ‌యాలు.. బిడ్డ‌, భ‌ర్త ప్రాణాల‌ను బ‌లితీసుకున్నాయి. త‌నతో స‌న్నిహితంగా ఉన్న వాడే త‌న ఐదేళ్ల కుమార్తె పాలిట కాల‌య‌ముడ‌య్యాడు. చిన్న పిల్ల అని కూడా చూడ‌కుండా గ‌త‌వారంలో పైశాచికంగా గొంతు కోసి హ‌త్య చేశాడు. త‌న గారాల‌ప‌ట్టి కిరాత‌కంగా హ‌త్య‌కు గుర‌వ‌డంతో తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైన తండ్రి ఇవాళ ఉద‌యం రైలు కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. గ‌త‌వారంలో ఘ‌ట్కేస‌ర్‌లో జ‌రిగిన ఐదేళ్ల చిన్నారి ఆద్య హ‌త్య ఘ‌ట‌న మ‌రువ‌క ముందే ఆ పాప తండ్రి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

2011లో ప్రేమ వివాహం.. 3 నెల‌ల‌ క్రిత‌మే ఓ యువ‌కుడి ప‌రిచ‌యం

భువ‌న‌గ‌రికి చెందిన క‌ల్యాణ్ మేడ్చ‌ల్ జిల్లాలోని ఆత్మ‌కూరులో పంచాయ‌తీ కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్నాడు. అత‌డు త‌న భార్య అనూష‌తో క‌లిసి ఘట్కేసర్‌లోని ఇస్మాయిల్ ఖాన్ గూడ ఏరియాలో విహారి హోమ్స్‌లో నివాసం ఉంటున్నాడు. వీరిద్దరూ 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ప్రేమ‌కు ప్ర‌తి రూపంగా 2015లో చిన్నారి ఆద్య పుట్టింది. హాయిగా సాగిపోతున్న‌ వారి జీవితంలోకి ముక్కూమొహం తెలియ‌ని వ్య‌క్తుల ప్ర‌వేశం.. ఆ కుటుంబంలో ఇప్పుడు పెను విషాదాల‌కు దారి తీసింది. అనూష‌కు క‌రుణాక‌ర్ అనే యువ‌కుడితో ప‌రిచ‌యమే ఇన్ని అన‌ర్థాల‌కు కార‌ణ‌మైంది. మూడు నెల‌ల క్రితం ప‌రిచ‌య‌మైన స్నేహంగా మారింది. భ‌ర్త‌కు తెలియ‌కుండా అత‌డితో ఆమె స‌న్నిహితంగా ఉంటూ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. త‌ర‌చూ అత‌డు ఇంటికి కూడా వెళ్లి క‌లుస్తుండే వాడు.

అయితే కొద్ది రోజుల క్రిత‌మే అనూష‌కు రాజ‌శేఖ‌ర్ అనే మ‌రో యువ‌కుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అత‌డితో స‌న్నిహితంగా ఉంటోంద‌ని తెలిసి, క‌రుణాక‌ర్ లోలోప‌ల ఉడికిపోయాడు. ఈ క్ర‌మంలో జూలై 2న అనూషకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్స‌ర్ చేయ‌లేద‌ని, ఆవేశంగా స‌ర్జిక‌ల్ బ్లేడ్ తీసుకుని ఆమె ఇంటికి వ‌చ్చాడు క‌రుణాక‌ర్. అప్ప‌టికే లోప‌ల రాజ‌శేఖ‌ర్ ఉండ‌డంతో తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. అత‌డి రాక‌ను గుర్తించిన అనూష వెంట‌నే రాజ‌శేఖ‌ర్‌ను బాత్‌రూమ్‌లో దాచింది. క‌రుణాక‌ర్‌కు ఏదో న‌చ్చ‌జెప్పి పంపేయొచ్చ‌ని అనుకున్న ఆమెకు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. ఆమె కుమార్తె ఐదేళ్ల ఆద్య‌ను పట్టుకుని రాజ‌శేఖ‌ర్ బ‌య‌ట‌కు రాకుంటే చంపుతాన‌ని బెదిరించాడు క‌రుణాక‌ర్. అయినా అత‌డు బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో వెంట తెచ్చిన స‌ర్జిక‌ల్ బ్లేడ్‌తో ఆద్య గొంతు కోశాడు. ఆ ప‌సిపాప అరుపుల‌తో రాజ‌శేఖ‌ర్ బ‌య‌ట‌కు రావ‌డంతో అత‌డిపైనా దాడికి య‌త్నించాడు. కానీ అత‌డు త‌ప్పించుకుని ప‌రార‌వ‌డంతో కరుణాక‌ర్ త‌న చేయి, గొంతు కోసుకున్నాడు. ఆ ప‌సికందును హుటాహుటీన ఆస్ప‌త్రికి త‌ర‌లించినప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. ఆద్య ప్రాణాలు కోల్పోయింది.

ఆద్య‌ను కిరాత‌కంగా హ‌త్య చేసిన క‌రుణాక‌ర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అత‌డిని ఆస్ప‌త్రిలో చేర్చి చికిత్స చేయించారు. ఆ కేసుపై ద‌ర్యాప్తు సాగుతుండ‌గానే ఇంత‌లో మ‌రో దారుణం జ‌రిగిపోయింది. త‌న ఒక్క‌గానొక్క కూతురు హ‌త్య‌కు గురికావ‌డంతో త‌ట్టుకోలేక‌పోయాడు తండ్రి క‌ల్యాణ్. త‌న బిడ్డ మ‌ర‌ణించిన నాటి నుంచి మాన‌సికంగా కుంగిపోయాడు. ఆ మ‌నోవేద‌న‌తో శ‌నివారం ఉద‌యం భువ‌న‌గిరిలోని త‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లాడు. భువ‌న‌గిరి రైల్వే స్టేష‌న్‌కు స‌మీపంలో ట్రైన్ కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఉద‌యం నుంచి అత‌డు క‌నిపించ‌క‌పోడంతో కుటుంబ‌స‌భ్యులు మ‌ధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. రైల్వే ట్రాక్‌పై క‌నిపించిన మృత‌దేహాన్ని కుటుంబ‌స‌భ్యుల‌కు చూపించ‌గా.. అత‌డే క‌ల్యాణ్ అని గుర్తించారు. ప‌ది రోజుల్లోపే తండ్రీకూతుళ్ల మ‌ర‌ణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.