జగిత్యాల, వెలుగు: 2018 సెప్టెంబర్ 11.. కొండగట్టు ఘాట్‌రోడ్డులో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 64 మంది చనిపోయారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఘాట్ రోడ్డును సర్కార్ మూసేసింది. ఆ దారిని డెవలప్‌చేస్తామని చెప్పిన సర్కారు ప్రమాదం జరిగిన ప్రాంతంతోపాటు మరో నాలుగుచోట్ల సైడ్ వాల్స్నిర్మించి వదిలేసింది. ప్రస్తుతం ఎప్పటిలాగే మూల మలుపులు డేంజర్ గా దర్శనమిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ప్రమాద నివారణ చర్యలు చేపట్టకుండానే ఘాట్ రోడ్డును గురువారం తిరిగి ఓపెన్చేస్తుండడంతో సర్కారు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇన్ని రోజులు ఎక్కేందుకే పర్మిషన్
కొండగట్టు ఘోర రోడ్డు ప్రమాదంలో 64 మంది అక్కడికక్కడే చనిపోగా 40 మంది తీవ్రగాయాలపాలై ఇంటికే పరిమితమయ్యారు. దీంతో రోడ్ సేఫ్టీ అథారిటీ, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, అర్ అండ్ బీ ఆఫీసర్లు సంయుక్తంగా ఎంక్వైరీ చేపట్టారు. ఘాట్ రోడ్డు వాలుగా ఉండడంతో హెవీ వెహికల్స్ ప్రయాణానికి అనువుగా లేదని నిర్ధారణకు వచ్చారు. ప్రయాణానికి అనుకూలంగా లేని ఈ ఘాట్ రోడ్డును మూసివేసి ప్రత్యామ్నాయంగా ఈ రోడ్డు పక్కనే అన్ని జాగ్రత్తలతో మరో ఘాట్ రోడ్డు నిర్మించేలా సర్కారు ఆలోచన చేసింది. ఈ మేరకు పనులు చేపట్టేందుకు రూ. 134 కోట్లు అవుతాయని అంచనా వేసింది. మూడేళ్లు గడిచినా ఈ దిశగా అడుగులు పడలేదు. పాత ఘాట్‌రోడ్డు దేవస్థానం మెట్లదారికి ఆనుకుని 2 కిలోమీటర్ల దూరం ఉంది. గుట్ట కింద నుంచి దేవస్థానానికి సుమారు 15- నుంచి 20 నిమిషాల్లో చేరుకునేవారు. 2018లో ప్రమాదం జరిగాక ఘాట్ రోడ్డును మూసి వేయడంతో భక్తులు గుట్ట కింద నుంచి దొంగలమర్రి మీదుగా జేఎన్టీయూ కాలేజ్ రూట్ లో 8 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం పాత ఘాట్ రోడ్డును దిగేందుకు కాకుండా కేవలం పైకి టు వీలర్స్, కార్లు ఎక్కేందుకు మాత్రమే తాత్కాలికంగా పర్మిషన్ఇచ్చారు. వీటికి సైతం ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా రూ. 40 లక్షలు ఖర్చు చేసి ఐదు చోట్ల సైడ్ వాల్స్ నిర్మించి, సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ దారిలో వెహికల్స్ఎక్కడంతోపాటు దిగేందుకు సైతం పర్మిషన్ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల భక్తులు జంకుతున్నారు. సర్కారు నిర్మించిన సైడ్ వాల్స్ కేవలం గుట్టపైకి వెళ్లేటప్పుడు యాక్సిడెంట్లకు మాత్రమే రక్షణ ఇస్తాయని, దిగేటప్పుడు వెహికల్స్ ను కంట్రోల్ చేసే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. కొత్త ఘాట్‌రోడ్డు ప్రతిపాదనలను పక్కన పెట్టి ప్రయాణానికి అనుకూలంగా లేని రోడ్డుపై రాకపోకలకు ఎలా పర్మిషన్ ఇస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
మా కష్టం ఎవరికీ రావద్దు
మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. మూడేళ్ల క్రితం నా భర్త స్వామి జగిత్యాలకు పని మీద వెళుతూ బస్సు ఎక్కాడు. కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయాడు. కుటుంబ పెద్దను కోల్పోయి ఎంతో గోస పడ్డాం. మేం ఎదుర్కొన్న కష్టం మరెవరికీ రాకూడదు. సర్కారు అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఘాట్ రోడ్డు రీ ఓపెన్చెయ్యాలె. ఆఫీసర్లు మరో ప్రమాదం జరగకుండా చూసుకోవాలే.
– అనిత, రాంసాగర్, కొడిమ్యాల మండలం
ప్రయాణానికి అనువుగా మార్చాలి
ప్రభుత్వం ఘాట్‌రోడ్డు ప్రారంభించడం సంతోషకరమే. భక్తులకు దూరభారం తగ్గుతుంది. కానీ ఘాట్ రోడ్డులో ప్రమాదకరంగా ఉన్న మూలమలుపుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఘాట్ రోడ్డుపై వెహికల్స్ జాగ్రత్తలు పాటిస్తూ వెళ్లేలా నిత్యం పోలీసుల పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా మరో ఘాట్ రోడ్డు నిర్మించాలి.
– నక్క అనిల్, బీజేపీ లీడర్, బల్వంతాపూర్, మల్యాల
