కేబీఆర్ పార్క్ చుట్టూ ..గ్రేడ్ సెపరేటర్ కారిడార్ ప్రాజెక్ట్‌ పై.. వీడియో రిలీజ్ చేసిన జీహెచ్ ఎంసీ

కేబీఆర్ పార్క్ చుట్టూ ..గ్రేడ్ సెపరేటర్ కారిడార్ ప్రాజెక్ట్‌ పై.. వీడియో రిలీజ్ చేసిన జీహెచ్ ఎంసీ

హైదరాబాద్ సిటీలోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు చేపట్టిన ప్రాజెక్టు పనులు జీహెచ్ ఎంసీ వేగవంతం చేసింది. ఆదివారం (మే17) కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించే  గ్రేడ్ సెపరేటర్ కారిడార్ ప్రాజెక్ట్‌ పై వీడియో రిలీజ్ చేసింది.జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రోడ్ నంబరు 45,జూబ్లీ చెక్ పోస్ట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్‌ కు ఎలాంటి నష్టం లేకుండా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. జీరో పార్క్ ఇంట్రూజన్‌ తో రోడ్డు మీడియన్స్‌ లోనే ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌ లు నిర్మించనున్నారు. ప్రాజెక్ట్ కోసం కేబీఆర్ పార్క్ లోని ఒక్క చెట్టును కూడా నరకబోమన్న అధికారులు స్పష్టం చేశారు. 

కాంక్రీట్‌ కు బదులుగా స్టీల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు జీహెచ్ ఎంసీ అధికారులు తెలిపారు.  స్టీల్ నిర్మాణాలతో పనులు 30–40 రెట్లు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపింది. నిర్మాణ సమయంలో ట్రాఫిక్‌ కు అంతరాయం ఉండకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. 

సెంట్రల్ మీడియన్ లో ఉన్న చెట్లను ట్రాన్స్‌ ప్లాంటేషన్ ద్వారా సురక్షితంగా తరలించనున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌ పోస్ట్ నుంచి ఫిలింనగర్ వరకు సిగ్నల్ ఫ్రీ కారిడార్ గా మార్చబోతున్నట్టు చెప్పారు. రోడ్ నెం.45, ఫిల్మ్‌నగర్, క్యాన్సర్ హాస్పిటల్, ముగ్ధా జంక్షన్లు కలిపే ఈ ప్రాజెక్టు పూర్తయితే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో వాయు కాలుష్యం 72 శాతం వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. 

ట్రాఫిక్ తగ్గడంతో 40 కోట్ల లీటర్లకు పైగా ఇంధన ఆదా అంచనా అవుతుందన్నారు. 13.66 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల నియంత్రణ లక్ష్యంగా జూబ్లీహిల్స్–మాదాపూర్ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గించేందుకు ఈప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకున్నారు. అభివృద్ధి, పర్యావరణ సమతూకంతో గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా ప్రాజెక్ట్ కొనసాగింపు ఉంటుందని జీహెచ్ ఎంసీ అధికారులు తెలిపారు.