- గ్రేటర్ తరహాలో మౌలిక వసతుల కల్పనకు కసరత్తు
- అండర్ పాస్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ల నిర్మాణం
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో ఇటీవల విలీనమైన శివారు ప్రాంతాలకు మహర్దశ పట్టనున్నది. విలీనానికి ముందే గ్రామీణ వాతావరణంలో ఉన్న ప్రాంతాల్లో గ్రేటర్ తరహాలో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నది. ముఖ్యంగా రోడ్ల విస్తరణ, భవిష్యత్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అండర్ పాస్ లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, అవసరమైన చోట ఫ్లై ఓవర్ల నిర్మాణం, స్ట్రీట్ లైట్ల నిర్వహణకు ప్లాన్చేస్తున్నది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే రూపకల్పన చేసిన రూ. 11, 460 కోట్ల బడ్జెట్లో విలీన సర్కిళ్లకు జీహెచ్ఎంసీ రూ. 2,260 కోట్లను కేటాయించింది.
ఈ స్థానిక సంస్థల ఆదాయానికి తగిన విధంగా రూ. వెయ్యి కోట్లను పెట్టుబడుల వ్యయం కింద కేటాయించారు. దీనికి తోడు పరిపాలనపరమైన ఖర్చు కోసం రెవెన్యూ వ్యయం కింద మరో రూ.860 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 400 కోట్లను గ్రాంటుగా కేటాయించారు.
కోర్ సిటీ తరహాలో పనులు..
పెట్టుబడుల వ్యయం కింద కేటాయించిన రూ. వెయ్యి కోట్లతో మౌలిక వసతుల కల్పనతో పాటు వివిధ రకాల అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఔటర్ లోపల, జీహెచ్ఎంసీ సమీపంలోనే ఈ ప్రాంతాలు ఉన్నప్పటికి కొన్ని చోట్ల కనీస వసతులు కూడా లేవు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కోర్ సిటీలోని మౌలిక వసతుల తరహాలోనే విలీన సర్కిళ్లలో కూడా మెగా సిటీ పేరుకు తగినట్టుగా పనులు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు జీహెచ్ఎంసీ అందిస్తున్న పౌర, అత్యవసర సేవలకు వినియోగిస్తున్న మెషినరీని విలీన సర్కిళ్లకు కూడా విస్తరించేందుకు అధికారులు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది. త్వరలోనే ఈ పనులు దశల వారీగా ప్రారంభించే అవకాశముంది.
హెచ్ సిటీ పనుల్లో భాగంగా..
మహానగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు రూ. 7,038 కోట్లతో ప్రతిపాదించిన హెచ్ సిటీ పనుల తరహాలో విలీన ప్రాంతాల్లో కూడా హెచ్ సిటీ పనులతో పాటు వరద నివారణ చర్యల్లో భాగంగా ప్రతిపాదించిన ఎస్ఎన్ డీపీ పనులు కూడా చేపట్టేందుకు బల్దియా ప్లాన్ చేస్తోంది. విలీన ప్రాంతాల ఆదాయానికి తగినట్టుగా భారీగా కేటాయింపులు జరిపినట్లు తెలిసింది. దీనికి తోడు ప్రస్తుతం విలీన సర్కిళ్లలో యూసీడీ, ఎంటమాలజీ, వెటర్నరీ విభాగాల లేకపోవడంతో పాటు టౌన్ ప్లానింగ్ విభాగాన్ని పటిష్ట పర్చాలన్న అంశాలను పరిగణలోకి తీసుకుని బడ్జెట్ లో కేటాయింపులు జరిపినట్లు తెలిసింది.
మరికొన్ని లోకల్ బాడీల ఆఫీసులను కూడా శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలన్న అంశాలను సైతం పరిగణలోకి తీసుకుని కేటాయింపులు జరిపినట్లు తెలిసింది. ఈ పనులు ప్రారంభించే ముందు అవసరమైన ప్రాంతాల్లో ప్రజల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించే అవకాశముంది.
