పక్క జిల్లాల ఆటోలు పట్టించుకోరు ..కొత్త ఆటోలకు పర్మిట్లు ఇయ్యరు..

పక్క జిల్లాల ఆటోలు పట్టించుకోరు ..కొత్త ఆటోలకు పర్మిట్లు ఇయ్యరు..
  •     గ్రేటర్​లో ఆటో డ్రైవర్ల కష్టాలు  
  •     స్టేట్​ పర్మిట్​ ఇవ్వాలని డిమాండ్​
  •     కేరళ తరహా విధానం అమలు చేయాలని రిక్వెస్ట్

హైదరాబాద్​సిటీ, వెలుగు: నగరంలో కొత్త ఆటోలకు అధికారులు పర్మిట్లు ఇవ్వడం లేదని, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్​జిల్లాల నుంచి వేల సంఖ్యలో ఆటోలు సిటీకి వచ్చి తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆటో డ్రైవర్లు, యూనియన్ల లీడర్లు ఆరోపిస్తున్నారు. దీంతో  గ్రేటర్ లో ఆటోలు కొని ఉపాధి పొందాలనుకునే వారు నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారని అంటున్నారు. 

చాలా సంవత్సరాల కింద కాలుష్యం కారణంగా సిటీలోకి కొత్త ఆటోలను ప్రభుత్వం నిషేధించింది. అయితే, ఇటీవల25వేల వరకు కాలుష్యరహిత సీఎన్జీ, ఎల్పీజీ ఆటోలకు పర్మిషన్లు ఇచ్చింది. ఇందులో డీలర్లు, షోరూమ్స్​నిర్వాహకులు, ఫైనాన్షియర్లు కుమ్మక్కై ఆటో రేట్లను పెంచేసి అమ్ముకున్నారని, ఎలక్ట్రిక్​ఆటోల పర్మిట్లు అస్సలే ఇవ్వడం లేదంటున్నారు. 

పర్మిట్లు ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదంటున్నారు. ప్రభుత్వం ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహిస్తున్నామని, పన్ను రాయితీతో పాటు ఉచిత రిజిస్ట్రేషన్​ కల్పిస్తామని ప్రకటనలు చేసిందని, కానీ, ఆ పరిస్థితి ఎక్కడా లేదంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఎలక్ట్రిక్ ఆటోలపై రాయితీలు ఉన్నాయని, టూవీలర్స్​, ఫోర్​వీలర్ల అమ్మకాలు జరుగుతున్నా ఆటోల దగ్గరకు వచ్చేసరికి అర్థం లేని నిబంధనలతో ఆపేస్తున్నారంటున్నారు. 

 పెరిగిపోతున్న పక్కజిల్లాల ఆటోలు

గత పదేండ్లలో పక్క జిల్లాల నుంచి నగరంలోకి దాదాపు 25వేల ఆటోలు వచ్చాయని ఆటో డ్రైవర్లు అంటున్నారు. తమకు పర్మిట్లు ఇవ్వక, వాటిని పట్టించుకోక తమ పొట్ట కొడుతున్నారంటున్నారు. ప్రభుత్వం ఆటోలకు స్టేట్​పర్మిట్లను జారీ చేస్తే తాము కూడా ఎక్కడికైనా వెళ్లి ఆటోలను నడుపుకుంటామని అంటున్నారు. 

ఇదే విషయంలో గతంలో కేరళలో వివాదం ఏర్పడితే కోర్టు ఆటోలకు స్టేట్​ పర్మిట్లు ఇవ్వాలని తీర్పు చెప్పిందన్నారు. మన ప్రభుత్వం కూడా ఆటోలకు స్టేట్, సిటీ పర్మిట్లను ఇస్తే బాగుంటుందంటున్నారు. 

వేరే జిల్లాల వారు ఇక్కడికి వచ్చి ఆటోలు నడుపుకోవడంపై తమకు అభ్యంతరం లేదని, కానీ స్థానికులకు కూడా పర్మిట్లను జారీ చేయాలన్నదే తమ డిమాండ్​గా అని అంటున్నారు. కాంగ్రెస్​ గత ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్​పర్మిట్​విధానాన్ని ప్రవేశ పెడతామని హామీ ఇచ్చిందని, దాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.