- బల్దియా మరో కీలక అడుగు
- డిజిటల్ పాలన, ఈజీ సేవలే లక్ష్యంగా కొత్త విధానం
- సమర్పించిన దరఖాస్తులు వెంటనే అధికారుల వద్దకు
- ఆ వెంటనే పరిశీలన, ఆమోదం
హైదరాబాద్ సిటీ, వెలుగు:సిటిజన్స్‌కు మరింత వేగవంతమైన సేవలందించేందుకు జీహెచ్‌ఎంసీ మరో కీలక అడుగు వేసింది, ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ సంబంధిత సేవలు ఇప్పటివరకు మీ-సేవ కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇకపై పూర్తిస్థాయి ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. ప్రజలు ఇంటి నుంచే బల్దియా అధికారిక వెబ్సైట్ www.ghmc.gov.in ద్వారా సులభంగా సేవలు పొందవచ్చని, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని జీహెచ్‌ఎంసీ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
డిజిటల్ పాలన, ఈజీ సేవలే లక్ష్యంగా ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. దరఖాస్తుదారులు ప్రాపర్టీ ట్యాక్స్ నెంబర్, ట్రేడ్ లైసెన్స్ నెంబర్ లేదా వెకెంట్ ల్యాండ్ నంబర్‌తో ‘ఆన్లైన్ సర్వీసెస్’ విభాగంలో సేల్ డీడ్, ఇతర పత్రాలు అప్లోడ్ చేయవచ్చన్నారు. సమర్పించిన దరఖాస్తులు తక్షణమే సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆన్లైన్లో బదిలీ అవుతాయన్నారు. వాటిని వారు పరిశీలించి వేగంగా ఆమోదం తెలుపుతారని అధికారులు వివరించారు.
ఇవన్నీ చేసుకోవచ్చు..
ఆస్తి పన్ను మ్యుటేషన్, ఆస్తుల యాజమాన్య హక్కుల మార్పిడి ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో చేసుకోవచ్చని, ఖాళీ స్థలం పన్ను మ్యుటేషన్, ఖాళీ స్థలాల యాజమాన్య బదిలీ సేవలు కూడా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. పీటీఐఎన్ నంబర్ బ్లాకింగ్, డూప్లికేట్ పీటీఐఎన్ నంబర్లు ఉన్నా.. భవనాలను కూల్చివేసినా.. లేదా పాత స్థానంలో కొత్త నిర్మాణం చేపడుతున్నా.. పాత పీటీఐఎన్ నంబర్‌ను ఆన్‌లైన్‌లోనే బ్లాక్ చేసుకోవచ్చన్నారు.
వీఎల్‌టీఎన్ నంబర్ బ్లాకింగ్ ద్వారా డూప్లికేట్ వీఎల్‌టీఎన్ నంబర్లను లేదా ఖాళీ స్థలంలో కొత్త భవనం నిర్మించినప్పుడు పాత నంబర్‌ను బ్లాక్ చేసే సౌలభ్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ట్రేడ్ లైసెన్స్ నంబర్ బ్లాకింగ్ ద్వారా వ్యాపారం మూసివేసినా లేదా డూప్లికేట్ ట్రేడ్ లైసెన్స్‌లు ఉన్నా వాటిని ఆన్‌లైన్‌లోనే రద్దు చేసుకోవచ్చని తెలిపారు.
కాగా, ఆస్తి పన్ను విధించుకోవడం, పన్ను పునఃసమీక్ష, మాజీ సైనికులకు పన్ను మినహాయింపు, మొబైల్ నంబర్, ఇంటి నంబర్, యజమాని పేరు మార్పులు, ఖాళీగా ఉన్న భవనాలకు పన్నులో రాయితీ వంటి సేవలు ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
