జీహెచ్ఎంసీ అప్పులు రూ.4 వేల కోట్లు.. విలీన ప్రాంతాల్లో మార్చి వరకు అన్ని సేవలు

జీహెచ్ఎంసీ అప్పులు రూ.4 వేల కోట్లు.. విలీన ప్రాంతాల్లో మార్చి వరకు అన్ని సేవలు
  • శానిటేషన్పై స్పెషల్ ఫోకస్
  • జవహర్​నగర్లో మరో 24 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు
  • జీహెచ్ఎంసీ అప్పులు రూ.4 వేల కోట్లు
  • ప్రెస్​మీట్లో కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడి

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ ఏడాది మార్చిలోపు విలీనమైన అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల సేవలు అందిస్తామని, అన్ని శాఖలకు సంబంధించిన ఆఫీసర్లను నియమిస్తామని, జోనల్ స్థాయిలో అన్ని సర్వీసులు అందుబాటులోకి వస్తాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. గురువారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి 2025 ఏడాది రిపోర్ట్ వెల్లడించారు. గ్రేటర్ పరిధి విస్తరించిందని, 650 చ.కి.మీ లలో ఉన్న బల్దియా ఇప్పుడు 2,053 చ.కి.మీకి పెరిగిందని, ఇందుకు అనుగుణంగా పనులు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా శానిటేషన్ పై స్పెషల్ ఫోకస్ పెట్టామని, సీఎం కూడా ఇదే విషయాన్ని ఇటీవల సమావేశంలో చెప్పారన్నారు. ప్రస్తుతం నగరమంతా 'మెగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్' కొనసాగుతోందన్నారు.

ఎక్కడైనా ఘన వ్యర్థాలు ఉంటే వాటిని తొలగిస్తున్నామని, పాత తుప్పు పట్టిన వాహనాలను రోడ్ల పక్కన పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుతుందని, చెత్త పేరుకుపోతుందని, ఇటువంటి వాహనాలను అక్కడి నుంచి తరలించి స్క్రాప్ చేస్తామన్నారు. 2025 జూలైలో కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ 6వ ర్యాంకును కైవసం చేసుకుందని,  ‘7-స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ’ రేటింగ్, వాటర్+ ఉన్న సిటీగా ఓడీఎఫ్ సర్టిఫికెట్ పొందినట్లు తెలిపారు. 

జవహర్‌నగర్‌లో 24 మెగావాట్ల సామర్థ్యం ఉన్న వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్ ఫేజ్–2  ప్రారంభించినట్లు తెలిపారు. కొత్త ఏడాదిలో మరో 24 మెగావాట్ల విద్యుత్ ఇక్కడ ఉత్పత్తి అవుతుందన్నారు. వ్యర్థాల ప్రాసెసింగ్ సామర్థ్యం రోజుకు 10,000 టన్నులకు చేరుకుందన్నారు. గ్రేటర్ పరిధి విస్తరించడంతో ఇప్పుడు రోజూ 9 నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందన్నారు.

చెత్త ఉల్లంఘనులకు రూ.2 కోట్ల ఫైన్లు
శానిటేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 10,752 చలానాలు జారీ చేసి రూ.2 కోట్ల 34 లక్షల జరిమానా విధించామని కమిషనర్​కర్ణన్​తెలిపారు. మెగా శానిటేషన్ డ్రైవ్ ద్వారా భారీ చెత్త, పాత చెత్త కుప్పలు, వదిలేసిన వాహనాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. 2025లో 9,656 ఆహార తనిఖీలు నిర్వహించగా, వీటిల్లో 3,499 శ్యాంపిల్స్ సేకరించామని, నిబంధనతలు పాటించని 1368 మందికి నోటీసులు జారీ చేశామని, 65 మంది వ్యాపారస్థులకు రూ.14.84 లక్షల జరిమానా విధించామన్నారు. 

ఇందులో 103 మంది వ్యాపారులపై  కేసులు పెట్టామన్నారు. ఫుడ్ సేఫ్టీ వెహికిల్ ద్వారా 145 శిక్షణా తరగతులు నిర్వహించామని, 4,673 పరీక్షలు నిర్వహించామని, 123 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఫుడ్ వ్యాపారం చేసేవారికి అవగాహన కల్పించామన్నారు. కేపీహెచ్​బీ కాలనీలో  రూ.5 కోట్లతో  ఫుడ్ టెస్ట్ ల్యాబ్  ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

రూ.1,512 కోట్ల ఆస్తి పన్ను వసూలు
డ్రోన్ సర్వేలతో 650 స్క్వేర్ కిలోమీటర్ల మేర జీఐఎస్ మ్యాపింగ్ చేశామని తెలిపారు. 14 లక్షల ఆస్తులను సర్వే చేసి అందులో లక్ష ఆస్తులు పూర్తిగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టట్లేదని గుర్తించామన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ సేవలను పూర్తిగా ఆన్‌ లైన్ చేశామన్నారు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ.1,512 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేశామన్నారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే రూ.121 కోట్లు అధికంగా వచ్చిందన్నారు. వనమహోత్సవం కింద 25 లక్షల మొక్కలు నాటమని, నగరవ్యాప్తంగా 40 కొత్త పార్కులు అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ప్రజల సహకారంతో 27 యూఎల్బీల విలీనంతో జీహెచ్ఎంసీ పరిధి 300 వార్డులు, 60 సర్కిళ్లు, 12 జోన్లకు విస్తరించిందని తెలిపారు. నగరాన్ని శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని కోరారు. జీహెచ్ఎంసీ కి 4 వేల కోట్ల అప్పులున్నాయని, వీటికి ప్రతీ నెల రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు  వడ్డీతో సహా అసలు తిరిగి  చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్ 81259 66586 లేదా 040–-2111 1111 సంప్రదించవచ్చన్నారు.

డెంగ్యూ కేసులు తగ్గినయ్
గతేడాదితో పోలిస్తే డెంగ్యూ  కేసులు 30 శాతం తగ్గాయని,  2024లో 2,806 కేసులుండగా, 2025లో 1,977 కేసులు నమోదయ్యాయన్నారు.  2025 ఏడాది నగరంలో 2,01,652 జననాలు జరగ్గా, పురుషులు1,03,622, స్త్రీలు: 98,030  ఉన్నారని,  83,936 మరణాలు నమోదయ్యాయన్నారు.  2025–-26 ఆర్థిక సంవత్సరంలో  రూ.2,706.32 కోట్ల అంచనాతో 9,993 పనులను చేపట్టగా, ఇప్పటికే రూ.1,023.53 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని, పీజేఆర్ ఫ్లైఓవర్, ఫలక్​నుమా ఆర్​ఓబీ, ఆరాంఘర్ ఫ్లైఓవర్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. 

నగరంలో పీఎం10  కాలుష్య స్థాయి 2017–18లో 110 క్యూబిక్ మీటర్ ఉండగా, 2024–25లో 81కు చేరిందన్నారు. నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ 400 ఉండగా, అవసరమైతే మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎలక్ర్టానిక్ వెహికిల్స్ చార్జింగ్ పాయింట్లు 150 ఉన్నాయని, 10 ఆర్డీసీ డిపోల్లో 10 ఏర్పాటు చేశామన్నారు.