డీఈఈలపై జీహెచ్ఎంసీ కమిషనర్ గుస్సా.. ఇటీవల డీఈఈలకు శానిటేషన్ బాధ్యతలు

డీఈఈలపై జీహెచ్ఎంసీ కమిషనర్ గుస్సా.. ఇటీవల డీఈఈలకు శానిటేషన్ బాధ్యతలు
  • చేయలేమంటూ చేతులెత్తేస్తున్న పలువురు
  • చర్యలు తీసుకునేందుకు సిద్ధం!

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్‌‌‌‌ఎంసీ విస్తరణ తర్వాత శానిటేషన్ బాధ్యతలను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు (డీఈఈ) అప్పగించినప్పటికీ వారు ఆ బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తి చూపడం లేదని కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. విస్తరణ తర్వాత 30 నుంచి 60 సర్కిళ్లు పెరగడంతో 60 మంది డీఈఈలను నియమించారు. గతంలో ఈ బాధ్యతలు మెడికల్ ఆఫీసర్లు నిర్వహించేవారు. ఇప్పుడు శానిటేషన్ పనులు మొత్తం డీఈఈలకు అప్పగించారు. అయితే తాము ఈ పనులు చేయలేమని చేతులెత్తేసినట్లు సమాచారం. 

శానిటేషన్ బాధ్యతలు చేపట్టే అధికారులు ఉదయం 5:30 గంటలకే ఫీల్డ్​లోకి రావాలి. రోడ్లపై చెత్త లేకుండా చూడటం, నగరంలో చెత్త సమస్య లేకుండా పర్యవేక్షించాలి. మొన్నటి వరకు మెయింటెనెన్స్ విభాగంలో పనిచేసిన ఇంజినీర్లు ఈ బాధ్యతల పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. కొందరు ఇంటికి దగ్గరలో పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, దేశంలోని అనేక ప్రముఖ నగరపాలక సంస్థల్లో ఇంజినీర్లే శానిటేషన్ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. 

ఇతర కార్పొరేషన్ల తరహాలోనే ఇక్కడ కూడా పారిశుధ్య వ్యవస్థ మెరుగుపరచడానికి ఇంజినీర్లకు బాధ్యతలు అప్పగించారు. అయితే ఇక్కడి డీఈఈలు ఈ బాధ్యతల పట్ల అయిష్టంగా ఉండడంతో కమిషనర్ ఆగ్రహంతో ఉన్నారు. అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించలేకపోతే చర్యలు తీసుకునేందుకు సిద్ధమని తెలిసింది.