ఇంటర్నల్ క్యాంపెయిన్​ షురూ.. వాట్సాప్​ మెసేజ్, ఫేస్​బుక్​‌లే కీలకం

ఇంటర్నల్ క్యాంపెయిన్​ షురూ.. వాట్సాప్​ మెసేజ్, ఫేస్​బుక్​‌లే కీలకం

ఇక ఇంటర్నల్ క్యాంపెయిన్​

​వాట్సాప్​ మెసేజ్, ఫేస్​బుక్​పై క్యాండిడేట్ల దృష్టి

హైదరాబాద్, వెలుగు: బహిరంగ ఎన్నికల ప్రచారానికి తెరపడటంతో, ఇంటర్నల్ క్యాంపెయిన్​కు పార్టీలు తెరలేపాయి. ప్రధానంగా యూత్, మహిళా, కుల సంఘాలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. దీంట్లో భాగంగా ఆయా సంఘాల లీడర్లతో మంతనాలు జరుపుతున్నాయి. పోలింగ్​ ప్రారంభానికి ఒక్క రోజే గడువుండడంతో లీడర్లంతా గంపగుత్తగా వచ్చే ఓట్లపై దృష్టి సారించారు. ప్రధాన పోటీదారులుగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కాలనీల్లోని కుల, మహిళ, యువజన సంఘాలతో చర్చలు మొదలుపెట్టాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో, వారందరికి ఎంతో కొంత ఇచ్చి వారివైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కాలనీల్లోని చోటమోటా లీడర్ల నంబర్లను సేకరించి, వారితో మంతనాలు చేస్తున్నారు. ఒక్కో యూత్, మహిళా సంఘాల కమిటీల్లో 15 నుంచి 25 మంది వరకు ఉంటున్నారు. వారిలో ఓటర్లుగా ఉన్న వారి సంఖ్యకు అనుగుణంగా డబ్బులు, వస్తువులను ఇచ్చేందుకు క్యాండిడేట్లు బేరసారాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు కాలనీల్లో యువజన సంఘాలకు క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లతో పాటు జిమ్ ఐటెమ్స్ అందిస్తున్నారు. దాంతోపాటు మందునూ ఇచ్చేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. మహిళా సంఘాలు కూడా భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి. కాలనీల్లో బోర్డు వేయించడం, ఇతర సౌకర్యాల కోసం కొందరు పట్టుపడుతున్నారు. మరోపక్క కుల సంఘాల నేతలు, వారి సంఘాలకు వస్తువులు కొనివ్వాలని, డబ్బులివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరితో చర్చలు సఫలం కాగా, ఇంకొందరు చర్చల్లో ఉన్నారు. ఏదిఏమైనా పోలింగ్ కు ఒకే రోజు గడువు ఉండటంతో,  ఇంటర్నల్ ప్రచారం మాత్రం అభ్యర్థులు జోరుగా సాగిస్తున్నారు.

సోషల్​ మీడియాలో ప్రచారం

వార్డుల్లో కార్యకర్తల దగ్గర నుంచి ఇప్పటికే ఓటర్ల ఫోన్ నంబర్లు సేకరించిన క్యాండిడేట్లు వాట్సాప్​లో తమకే ఓటేయాలని సందేశాలు పంపుతున్నారు. ఫేస్​బుక్​లలో షేర్ చేస్తున్నారు. కొత్తగా కార్పొరేటర్​అభ్యర్థిగా పోటీ చేస్తున్నవారైతే ఆ వార్డులో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారానికి హామీలు, ప్రస్తుత కార్పొరేటర్ల వైఫల్యాలను వాట్సాప్​ మెస్సెజ్​ల్లోనే పంపుతున్నారు. కాలనీలు, బస్తీల్లోని 100, 200 మందితో గ్రూపు ఏర్పాటు చేసి అందులో తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. తాము గెలిస్తే డివిజన్‌‌కు ఏమి చేయనున్నామో వాటి ద్వారా చెబుతున్నారు.  ఎవరెవరికి ఏమేం బహుమతులు కావాలి ? ఏ కాలనీకి ఎంత మొత్తం ఇచ్చేది కూడా గుట్టుగా వాట్సాప్​గ్రూప్​ల్లోనే పంచుకుంటున్నారు. అయితే ఎడ్యుకేటెడ్, ఎంప్లాయీస్ ​కొందరు ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తూ డైరెక్ట్​గా కామెంట్స్​ పెడుతుండటం గమనార్హం.

24 గంటలే కీలకం

ఓటింగ్ కు ముందు రోజు, ఓటింగ్​ నాడు మధ్యాహ్నం వరకు వాట్సాప్, ఫేస్​బుక్ మెసేజ్​లతో ఎంత ప్రభావితం చేస్తే అంత ఓటింగ్​ పెరిగే అవకాశం ఉంటుంది. పాజిటివ్​ అంశాలనే ఎక్కువగా షేర్​ చేస్తున్నం. క్యాండిడేట్, పార్టీకి సంబంధించిన వీడియో సందేశాలు, స్పెషల్​గా క్రియేట్​ చేసిన మెసేజ్​లు పంపుతున్నం. ఎప్పటికప్పుడు ఓటర్ల మూడ్​ తెలుసుకుంటూ కంటెంట్​పెడుతున్నం. మా టీంలో 20 మంది ఉన్నరు. అవసరం అనుకున్న గ్రూప్​ల్లో అప్పటికప్పుడు అభ్యర్థి  ప్రత్యేక వాయిస్​ మెస్సెజ్ లు కూడా పంపుతున్నం.

– కార్పొరేటర్ ​అభ్యర్థి, సోషల్​మీడియా క్యాంపెయినర్​

For More News..

గ్రేటర్ బెట్: ఏ పార్టీకి ఎన్ని సీట్లోస్తయ్.. రూ. 2 వేల నుంచి రూ. 10 లక్షల దాకా బెట్టింగ్

బీజేపీ క్యాండిడేట్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి!

ఎల్​ఆర్​ఎస్​ స్పీడ్​.. గ్రేటర్​ ప్రజలపైనే రూ. 2 వేల కోట్లకుపైగా భారం

ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌‌.. అప్పులు తీర్చేందుకు తల్లి, చెల్లి హత్య?