వాడీవేడిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం

వాడీవేడిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈనెల 17వ తేదీన బంజారాహిల్స్ లో కుమ్రంభీం ఆదివాసీ భవన్, సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారా భవన్ లను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. టీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను భజన కార్యక్రమంగా మారుస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. 

కాంగ్రెస్ కార్పొరేటర్ల నిరసన

రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామంటూ చెప్పిన జీహెచ్ఎంసీ.. కనీసం కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేకపోతోందంటూ మండిపడ్డారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న జీహెచ్ఎంసీ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు తీసుకురాలేకపోతోందన్నారు. అప్పులు తెచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కనీసం విధి దీపాల నిర్వహణ కూడా జీహెచ్ఎంసీ సక్రమంగా చేపట్టడం లేదన్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. 

నిరసనగా సమావేశాలకు బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు 

అంతకుముందు.. బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలుపుతూ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలకు ర్యాలీగా వెళ్లారు. జాంబాగ్ కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మద్దతుగా కౌన్సిల్ సమావేశానికి వెళ్లారు. ‘నువ్వు పోరాటం చేయి.. నీకు మా మద్దతు ఉంది’ అంటూ జైస్వాల్ నినదించారు. ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్లకార్డులు పట్టుకుని జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలకు హాజరయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా కాంగ్రెస్ కార్పొరేటర్లతో పాటు సమావేశానికి హాజరయ్యారు. 

ఉదయం10 గంటల30 నిమిషాలకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. విజయలక్ష్మి మేయర్ అయిన తర్వాత జరుగుతున్న మూడో కౌన్సిల్ సమావేశం ఇది. దాదాపు 150మంది పోలీసులతో పాటు డీఆర్ఎఫ్ కు చెందిన మార్షల్స్ తో బందోబస్తు ఏర్పాటు చేశారు. గడిచిన కౌన్సిల్ సమావేశాల్లో పూర్తిస్థాయిలో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు. ఈ సారి రెండు రోజుల పాటు కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.