జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రచ్చ రచ్చ

జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రచ్చ రచ్చ
  • గందరగోళం మధ్యనే రూ.6,224 కోట్ల బడ్జెట్ కు ఆమోదం 
  • ఎలాంటి చర్చ లేకుండా రెండు గంటల్లోనే ముగిసిన సభ 
  • ప్రజాసమస్యలపై చర్చించాలంటూ మేయర్ పోడియం చుట్టుముట్టిన బీజేపీ కార్పొరేటర్లు.. సస్పెండ్ చేసిన మేయర్
  • రోడ్డుపై కార్పొరేటర్ల ధర్నా.. అరెస్టు చేసిన పోలీసులు 


హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్​ రసాభాసగా మారింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు పోటాపోటీగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నినాదాల మధ్యనే 2023–2024 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6,224 కోట్ల బడ్జెట్ కు ఆమోదం తెలుపుతున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు. మధ్యాహ్నం వరకు కూడా గందరగోళం కొనసాగడంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు.

దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఎలాంటి చర్చ లేకుండా కేవలం రెండు గంటల్లోనే ముగిసింది. ఉదయం 10:26 గంటలకు సమావేశం ప్రారంభం కాగా.. ప్రజా సమస్యలపై చర్చించాలంటూ బీజేపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం చుట్టుముట్టారు. జీహెచ్ఎంసీ పనుల్లో ఎమ్మెల్యేల పెత్తనం ఉండొద్దని, బడ్జెట్ మీటింగ్ రెండ్రోజులు నిర్వహించాలని, పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆందోళనకు దిగారు. మరోవైపు గోషామహల్ లో నాలా కుంగిన ఫొటోలను ప్రదర్శిస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా ఆందోళనకు దిగడంతో సభ గందరగోళంగా మారింది. దీంతో 10:35 గంటలకు బయటకు వెళ్లిన మేయర్.. తిరిగి 10:51 గంటలకు లోపలికి వచ్చారు. అయినా ఆందోళన ఆగకపోవడంతో సభను వాయిదా వేశారు. తిరిగి 11:02 గంటలకు సభ ప్రారంభించగా, మళ్లీ ఆందోళనలు కొనసాగించారు. గందరగోళం మధ్యనే బడ్జెట్ ను ఆమోదిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. ఎలాంటి చర్చ లేకుండా ఎలా ఆమోదిస్తారని బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన మరింత ఉధృతం చేశారు. దీంతో మేయర్ 11:15 గంటలకు టీ బ్రేక్ ఇచ్చారు. తిరిగి 11:49 గంటలకు సభను ప్రారంభించగా ఆందోళనలు మళ్లీ కొనసాగాయి. పోడియం వద్ద ఉన్న బీజేపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి మేయర్ బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపటికి హాల్ లోకి వచ్చి సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

బీజేపీ సభ్యులే గొడవ చేసిన్రు: మేయర్  

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జీహెచ్ఎంసీతో పాటు మిగతా మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు తెచ్చారని మేయర్ విజయలక్ష్మి ప్రశ్నించారు. కౌన్సిల్ వాయిదా పడిన తర్వాత ఆమె తన చాంబర్ లో మీడియాతో మాట్లాడారు. సమస్యలపై చర్చిండానికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, బీజేపీ సభ్యులు కావాలనే ఆందోళన చేశారని మండిపడ్డారు. వాళ్ల ఆందోళనతోనే సభలో చర్చ జరగలేదన్నారు. దేనిపై చర్చించాలో తెలియక, సబ్జెక్ట్ లేకనే వాళ్లు గొడవకు దిగారని విమర్శించారు. మళ్లీ బడ్జెట్ సమావేశం పెట్టాలి: బీజేపీ కార్పొరేటర్లు బడ్జెట్ సమావేశం మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ ఆఫీసు ఎదుట బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి వెళ్లి మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాళ్లను పోలీసులు అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి చర్చ లేకుండానే సమావేశాన్ని ముగించాయని కార్పొరేటర్ దేవర కరుణాకర్ మండిపడ్డారు. దీనిపై లీగల్ గా వెళ్తామని చెప్పారు. ఆందోళనలో కార్పొరేటర్లు నర్సింహారెడ్డి, తోకల శ్రీనివాస్ రెడ్డి, దర్శన్ తదితరులు పాల్గొన్నారు. 

మేయర్ చాంబర్ వద్ద కాంగ్రెస్ ఆందోళన.. 

కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ చాంబర్ ముందు ఆందోళన చేశారు. సభను నడపడం కూడా మేయర్ కు చేతకావడం లేదని కార్పొరేటర్ విజయారెడ్డి విమర్శించారు. 

అరెస్టులు అక్రమం: సంజయ్

బీజేపీ కార్పొరేటర్లను అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ స్టేట్ చీఫ్ సంజయ్ తీవ్రంగా ఖండించారు. అప్రజాస్వామికంగా అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. బీఆర్ఎస్ నిరంకుశ, నియంత పాలనకు ఇదే నిదర్శనమన్నారు.