మూడు కార్పొరేషన్లుగా GHMC.. 3 కార్పొరేషన్లకు కమిషనర్లు వీరే..!

మూడు కార్పొరేషన్లుగా GHMC.. 3 కార్పొరేషన్లకు కమిషనర్లు వీరే..!

హైదరాబాద్: పరిపాలన సౌలభ్యం కోసం జీహెచ్ఎంసీని ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్‎తో పాటు గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం (ఫిబ్రవరి 11) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ప్రభుత్వం కమిషనర్లను నియమించింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్‎గా సృజన నియమితులయ్యారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్‎గా వినయ్ కృష్ణా రెడ్డి‎ని నియమించింది ప్రభుత్వం. ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అదే పదవిలో కొనసాగనున్నారు. 

పలువురు ఐఏఎస్‎ల బదిలీ:

ప్రభుత్వం పలువురు ఐఏఎస్‎లను బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం (ఫిబ్రవరి 11) ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాష్‏కు పోస్టింగ్ ఇచ్చింది. ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్‎గా సవ్యసాచి ఘోష్ నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక సీఎస్‎గా సవ్యసాచి ఘోష్​ కొనసాగనున్నారు. ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. 

పంచాయతీ రాజ్ కమిషనర్‎గా దివ్వకు అదనపు బాధ్యతలు అప్పగింత. ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా కాత్యాయనీ దేవీ నియమితులయ్యారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ జేఎండీగా ఆమె అదనపు బాధ్యతలు కొనసాగనున్నారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా రఘురామ్ శర్మ నియమితులయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీగా ఆయన అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు.

ఓఆర్ఆర్ వరకు జలమండలి విస్తరణ:

జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం జలమండలి పరిధి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వరకు విస్తరించింది. ఈ మేరకు బుధవారం (ఫిబ్రవరి 11) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జలమండలి పరిధి విస్తరించడంతో ముగ్గురు అధికారులను ఈడీలుగా నియమించింది. 

జీహెచ్ఎంసీ అడిషనల్ కమీషనర్‏గా ఉన్న పంకజకు జలమండలి మల్కాజ్గిరి ఈడీగా పోస్టింగ్ ఇచ్చింది. సామ్రాట్ అశోక్‎ జలమండలి హైదరాబాద్ ఈడీ నియమితులయ్యారు. సంతోష్‎కు జలమండలి సైబరాబాద్ ఈడీగా పోస్టింగ్ ఇచ్చింది. ప్రస్తుతం జలమండలి ఈడీ పని చేస్తున్న మయాంక్ మిట్టల్‎కు జాయింట్ ఎండీ‎గా పోస్టింగ్ ఇచ్చింది. 

ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో నీటి సరఫరా, మురుగు వ్యవస్థ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా జలమండలికి అప్పగించింది. ORR పరిధిలోని నీటి సరఫరా, సివరేజ్ నిర్వహణను జీహెచ్ఎంసీ నుంచి జలమండలికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 1450 స్క్వేర్ కిలోమీటర్ల మేర మంచినీటి సరఫరా‎తో పాటు 650 స్క్వేర్ కిలోమీటర్ల మేర సివరేజ్ నిర్వహణ చేస్తోంది జలమండలి. 

ఇకనుంచి 2,053 స్క్వేర్ కిలోమీటర్ల మేర మంచినీటి సరఫరాతో పాటు సివరేజ్ నిర్వహణను జలమండలి చూడనుంది. కొత్తగా అవసరమైన ప్రాంతాల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోనుంది. నీటి సరఫరా, మురుగు వ్యవస్థలతో పాటు సంబంధిత అనుబంధ మౌలిక వసతుల అభివృద్ధి కూడా జలమండలి చేపట్టనుంది.