ఎల్బీనగర్, వెలుగు: కార్మికులను బూతులు తిడుతున్న జీహెచ్ఎంసీ సర్కిల్ 4, 5 సీనియర్ ఎంటమాలజిస్ట్, ఏఈలను సస్పెండ్ చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఊదరి గోపాల్ డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ జోనల్ ఆఫీస్వద్ద ఎంటమాలజీ కార్మికులతో కలిసి బుధవారం నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీనియర్ ఎంటమాలజిస్ట్ మాధవ రెడ్డి, ఔట్ సోర్సింగ్ ఏఈ రాంబాబు, మరో ఏఈ మణెమ్మ డీజిల్కూపన్లు అమ్ముకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని, కార్మికులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని తెలిపారు. వారిని సస్పెండ్ చేయాలని కోరారు. జీహెచ్ఎంసీ కమిషనర్, విజిలెన్స్ అండ్ఎన్ఫోర్స్ మెంట్ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
