మాన్సున్ ఎమర్జెన్సీ టీమ్స్ ఎక్కడా?... భారీ వానలు కురుస్తున్నా సగం టీమ్స్ కూడా ఏర్పాటు చేయలే

మాన్సున్ ఎమర్జెన్సీ టీమ్స్ ఎక్కడా?... భారీ వానలు కురుస్తున్నా సగం టీమ్స్ కూడా ఏర్పాటు చేయలే
  • వాహనాల కోసం పిలిచిన టెండర్లలో రూల్స్​ మార్పు 
  • రూ.30 వేలకు బదులు 62 వేలు చెల్లించేలా రివైజ్​
  • డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: వర్షాలు మొదలైనా పూర్తి స్థాయి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఏర్పాటు చేయడంలో బల్దియా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇంకా కొన్నిచోట్ల టెండర్లు కూడా పూర్తి చేయలేదు. ఈ వర్షాకాలానికి గ్రేటర్ లో159 మొబైల్ మాన్సున్ ఎమర్జెన్సీ టీమ్స్,155 స్టాటిక్ లేబర్ టీమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వీటితో పాటు 164  వెహికిల్స్ అద్దె ప్రతిపాదికన తీసుకోవాలనుకున్నారు. వీటన్నింటికి రూ.49.33 కోట్లను బల్దియా ఖర్చు చేయనుంది. అయితే, ఇందులో ఇప్పటి వరకు 50 మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, 90 స్టాటిక్ లేబర్ టీమ్స్ మాత్రమే  ఏర్పాటు చేశారు. అప్పుడే వర్షాలు మొదలైనా మిగతా టీమ్స్​ఏర్పాటులో చొరవ చూపడం లేదు. పైగా, గతేడాది 394 టీమ్స్ ఏర్పాటు చేయగా, ఈ సారి 80 టీమ్స్​ను తగ్గించారు.  

ఎమర్జెన్సీ టీమ్స్​ ఏం చేస్తాయంటే..

గ్రేటర్ లో వర్షాకాలంలో ఇబ్బందులను తొలగించేందుకు ప్రతిఏడాది మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్​ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తోంది. భారీ వర్షాలతో రోడ్లపై నీరు నిలిచిన సందర్భాల్లో, వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద సమస్య తీర్చడానికి, మ్యాన్ హోల్స్ క్లియర్ చేయడానికి, రోడ్లపై విరిగిపడిన చెట్ల కొమ్మలను తొలగించడానికి, రోడ్లపై గుంతలను పూడ్చడానికి ఈ టీమ్స్​పని చేస్తాయి. భారీగా నీళ్లు నిలిచే ప్రాంతాల్లో ఈ బృందంలోని వర్కర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. 

టెండర్లు రివైజ్​ ఎందుకో

నలుగురు వర్కర్లతో కూడిన ఒక్కో మాన్సూన్​టీం ఐదు నెలల పాటు పని చేయాల్సి ఉంటుంది. ఒక్కో టీమ్​కు కావాల్సిన వాహనాన్ని జూన్‌ మొదటి వారం నాటికే కేటాయించాలి. దీనికి సంబంధించి మెయింటెనెన్స్ విభాగం150  వార్డుల్లో టెండర్లు పిలిచింది. కానీ, చివరి నిమిషంలో అందులో రూల్స్​మార్చి రివైజ్​చేశారు. ఇంతకుముందు టెండర్లలో టాటా ఏస్ లేదా ట్రాక్టర్ లేదా జీప్ వంటి వాహనాలు కావాలని పేర్కొనగా, తర్వాత ఖరీదైన ఇసుజు వాహనాలకు మాత్రమే వర్తించేలా టెండర్ రూల్స్ మార్చారు. అంతకుముందు  150 ప్యాకేజీలకు 150 మంది కాంట్రాక్టర్లు ఉండేవారు. 

కానీ, మళ్లీ దాన్ని 9 ప్యాకేజీలుగా చేసి 9 మందికే అప్పగించేలా చేశారు. కొందరికే ఉపయోగపడేలా టెండర్ రూల్స్ మార్చడం వెనక ఏదో జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. బల్దియాపై ఆర్థికభారం తగ్గించేందుకు కమిషనర్​అద్దె వాహనాలను తగ్గించాలని నిర్ణయించగా, మళ్లీ ఖరీదైన వాహనాలకు ప్రయార్టీ ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. గతంలో ఒక వెహికిల్‌కు నెలకు బల్దియా ట్రాన్స్ పోర్ట్ విభాగం రూ.30 వేలు మాత్రమే చెల్లించేది. ఈసారి కొత్తగా వస్తున్న ఇసుజు వాహనానికి రూ.62,500 చెల్లించనుంది. పైగా, ఐదునెలల పాటు మాన్సున్ లో పని చేసిన తర్వాత అదే అద్దెపై రోడ్ల రిపేర్లు, తదితర వాటి కోసం వినిగిస్తామని అధికారులు చెబుతున్నారు. 

కొత్త వాహనాలతో అదనపు భారం..

గతంలో150 వార్డులకు వాహనాల ఖర్చు రూ.45 లక్షలు కాగా, కొత్తగా వస్తున్న164 ఇసుజు వాహనాలతో అది రూ. కోటి రెండు లక్షలకు చేరుకుంటోంది. అంటే జీహెచ్ఎంసీపై ప్రతి నెలా రూ.57 లక్షల 50 వేల అదనపు భారం పడనున్నది. ఇది ఏడాదికి రూ.6 కోట్ల 90 లక్షలకు చేరుకుంటుంది. ఈ అగ్రిమెంట్ వెహికిల్స్ మూడేండ్ల పాటు కొనసాగేలా రూల్​ఉండడంతో రూ.20 కోట్ల 70 లక్షలు అదనంగా చెల్లించేందుకు బల్దియా ట్రాన్స్ పోర్ట్ అధికారులు సిద్ధమయ్యారు. వాహనాలతో పాటు వర్కర్లు, సామగ్రి కలిపితే..ఈ భారం ఇంకా పెరుగుతుంది. 

ట్రాక్టర్లు, టాటా ఏస్ వాహనాలతో వర్కర్ల తరలింపు, సిల్ట్, చెట్ల కొమ్మలు తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటుందని, పని పరికరాలు, బీటీని కావాల్సిన చోట్లకు తీసుకెళ్లేందుకు, ఇరుకైన కాలనీల్లోకి తీసుకెళ్లేందుకు సాధ్యమవుతుందని, కానీ, ఇసుజు వాహనాలు మల్టీ పర్పస్ పనుల కోసం ఉపయోగించడం వీలు కాదంటున్నారు. వెహికిల్ మూవ్‌మెంట్‌తో పాటు మెటీరియల్ ట్రాన్స్‌పోర్ట్‌కు కూడా ఇసుజు వెహికిల్స్ అనుకూలంగా ఉండవంటున్నారు. 

ట్రాక్టర్ల క్యాబిన్‌తో పోలిస్తే.. ఇసుజు క్యాబిన్ తక్కువ ఉండడం వల్ల మల్టీ పర్పస్ గా వాడుకోవడం కుదరదని చెప్తున్నారు. అయినా జీహెచ్ఎంసీ ట్రాన్స్‌పోర్ట్ విభాగం ఒక కంపెనీకి చెందిన వాహనాలను తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొత్త వాహనాలు వస్తే పని సామర్ధ్యం పెరగాలి కానీ, ఇక్కడ పని తగ్గడమే కాకుండా ఆర్థిక భారం కూడా పడుతోంది. టెండర్ల దగ్గర నుంచి అంత గందరగోళంగా ఉన్న ఈ వ్యవహారం వెనక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి.