
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర బడ్జెట్లో జీహెచ్ఎంసీకి రూ.3,065కోట్లు కేటాయించడంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్ రెడ్డి, కాంగ్రెస్కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం బల్దియా హెడ్డాఫీసులో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలుపుతూ స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ..
హైదరాబాద్ అభివృద్ధి కోసం బడ్జెట్లో మొత్తం రూ.10 వేల కోట్లు కేటాయించడం గొప్ప విషయమన్నారు. జీహెచ్ఎంసీకి కేటాయించిన రూ.3,065కోట్లు, వాటర్‌బోర్డుకు అలాట్చేసిన రూ.3,385 కోట్లతో మేజర్ప్రాజెక్టులు పూర్తవుతాయని, తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధి, ఓఆర్ఆర్వరకు జీహెచ్ఎంసీ విస్తరణకు హైడ్రా ఏర్పాటు సిటీ అభివృద్ధికి కీలకమన్నారు. కార్పొరేటర్లు రాజశేఖర్ రెడ్డి, సీఎన్ రెడ్డి, మహాలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం వారంతా సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.