
- అమీర్ పేట్, మైత్రివనం ప్రాంతాలను పరిశీలించిన జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: అమీర్ పేట్, మైత్రివనం ప్రాంతాలు వరద ముంపునకు గురికాకుండా చేపట్టాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు వేర్వేరుగా క్షేత్ర స్థాయిలో ఇరువురు ఆ ప్రాంతలను పరిశీలించారు. ఇక్కడ వరద ముంపు సమస్య రాకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. గురువారం వారిద్దరు జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్, కన్సల్టెంట్లతో కలిసి మరోసారి ఈ ప్రాంతాల్లో పర్యటించారు.
వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జూబ్లీ హిల్స్, వెంకటగిరి, రహ్మత్ నగర్, యూసుఫ్ గూడ ప్రాంతాల నుంచి కృష్ణకాంత్ పార్క్ మీదుగా పారే కాలువ గాయత్రి నగర్ వద్ద ఉన్న నాలాలో కలుస్తుందని, ఈ ప్రాంతాలతో పాటు ఇటీవల మధురానగర్, శ్రీనివాస్ నగర్ వెస్ట్ నుంచి భారీగా వరద రావడంతో రోడ్డు మొత్తం మునిగిపోయిందని చర్చలో ప్రస్తావించారు. దీనికి పరిష్కారం చూపే అంశంపై అధికారులతో చర్చించారు. నాలా పునర్నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలనే నిర్ణయానికి వచ్చారు.