కోట్లల్లో సంపాదిస్తూ ఇంత కక్కుర్తి ఏంటో.. ట్రేడ్ లైసెన్స్ ఫీజుకు ఎగనామం పెట్టిన అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు

కోట్లల్లో సంపాదిస్తూ ఇంత కక్కుర్తి ఏంటో.. ట్రేడ్ లైసెన్స్ ఫీజుకు ఎగనామం పెట్టిన అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు
  • తనిఖీల్లో గుర్తించి నోటీసులు జారీ చేసిన జీహెచ్​ఎంసీ  
  • వ్యాపార విస్తీర్ణం తగ్గించి చూపుతూ ఫీజు తక్కువ చెల్లింపు
  • ఏడాదికి రూ.11.52 లక్షలకు 49 వేలు కడుతున్న అన్నపూర్ణ స్టూడియో
  • రూ.2.73 లక్షలకు 7,614 కడుతున్న రామానాయుడు స్టూడియో  
  • ఏండ్లుగా ఇదే తంతు.. మొత్తం ఫీజు చెల్లించాలంటూ బల్దియా ఆదేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపిస్తూ ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. ఎగవేసిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలంటూ శుక్రవారం (నవంబర్ 21) నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్​లో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు తక్కువగా వసూలవుతుండడంతో బల్దియా అధికారులు స్పెషల్ డ్రైవ్  నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సిని హీరో అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ  ట్రేడ్ లైసెన్స్ వివరాలు పరిశీలించగా రూ.49,032 మాత్రమే ఫీజు చెల్లిస్తున్నట్లు గుర్తించారు.

 అనుమానం రావడంతో స్టూడియో విస్తీర్ణాన్ని పరిశీలించి 1,92,066 స్క్వేర్​ ఫీట్లు ఉన్నట్లు తేల్చారు. ఇంత పెద్ద స్థలంలో స్టూడియో రన్​చేస్తూ బిజినెస్​చేస్తున్నప్పటికీ కేవలం 8,172 చదరపు అడుగులకు మాత్రమే ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లిస్తున్నారని తెలుసుకున్నారు. 1,92,066 స్క్వేర్​ ఫీట్లకు ట్రేడ్ లైసెన్స్ ఫీజు రివైజ్ చేసి చూడగా, ఏడాదికి రూ.11,52,396 కట్టాల్సి ఉందని, 49 వేలు కట్టడం ఏమిటని అవాక్కయ్యారు. దీంతో పదకొండున్నర లక్షలు కట్టాలని నోటీసులు జారీ చేశారు. ఇదివరకే రూ.49,032 చెల్లించగా, మిగతా రూ.11,03,364 చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. 

రామానాయుడు స్టూడియో కూడా.. 

దగ్గుపాటి సురేశ్​బాబుకి చెందిన రామానాయుడు స్టూడియో కూడా ఇదే తరహాలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎగ్గొట్టింది. మొత్తం 68,276 చదరపు అడుగుల్లో స్టూడియో నడుపుతూ కేవలం 1,903 స్క్వేర్​ఫీట్లలో మాత్రమే వ్యాపారం చేస్తున్నట్లు చెప్పి ఏటా రూ.7,614 మాత్రమే కడుతున్నారు. దీన్ని రివైజ్​చేసి మిగిలిన రూ.2,65,490 చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. దీంతో రామానాయడు స్టూడియోస్​నిర్వాహకులు  మిగిలిన మొత్తాన్ని కట్టేశారు.  

మొదటి నుంచీ ఇంతే..

ఈ రెండు స్టూడియోలు మొదటి నుంచీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగానే చెల్లిస్తున్నాయి. అయితే, అధికారులు కూడా వాళ్లు కట్టిన మొత్తమే తీసుకుంటున్నారు. ఇప్పుడు అసలు విషయం బయటపడడంతో మొదటి నుంచీ ఎగ్గొట్టిన ట్రేడ్​లైసెన్స్ ఫీజు వసూలు చేస్తారా లేక ఈ ఏడాది కట్టాల్సిన మొత్తమే తీసుకుని వదిలేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయమై జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యను వివరణ కోరగా స్పష్టత ఇవ్వలేదు.

 ‘ఇప్పటికైతే ఈ ఏడాదికి సంబంధించి రివైజ్ చేసిన మొత్తాన్ని వసూల్ చేస్తం. మిగతాదానిపై ఆలోచిస్తం’ అని ‘వీ6 –వెలుగు’తో  చెప్పారు. కాగా, ట్రేడ్​ ఫీజు చెల్లించకుండా వ్యాపారం చేయడం, అది చెల్లింపు రెండు నెలలు దాటితే 50 శాతం జరిమానాతో ఫీజు వసూలు చేయాలని జీహెచ్ఎంసీ యాక్ట్​ చెప్తున్నది. కేవలం పదేండ్ల లెక్క చూసుకుంటేనే అన్నపూర్ణ స్టూడియో నుంచి రూ. కోటికి పైగా, రామానాయుడు స్టూడియో నుంచి రూ.20 లక్షలకు పైగా బల్దియాకు రావాల్సి ఉంది.

అధికారులు కూడా భాగస్వాములేనా? 

ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తున్నది. బల్దియాకు సొమ్ము కట్టించే బదులు.. ఎంతో కొంత తీసుకుని వదిలేద్దామన్న ధోరణి కనబడుతున్నది.  ఏటా క్రమం తప్పకుండా విస్తీర్ణాన్ని బట్టి ఫీజులు వసూలు చేయాల్సిన అధికారులు ఆఫీసుల్లో కూర్చొని వ్యాపారులు ఆన్ లైన్ లో ఎంత చెల్లిస్తే అంత తీసుకుంటున్నారు. ఫీల్డ్‌‌కు వెళ్లట్లేదు. దీంతో బల్దియాకు కోట్లల్లో నష్టం వస్తోంది. 3 నెలల కింది వరకు సర్కిల్ స్థాయిలో ఉండే మెడికల్ ఆఫీసర్లు ట్రైడ్ లెసెన్స్ కు సంబంధించిన వ్యవహారాలు చూసేవారు.

 తర్వాత ఈ బాధ్యతలను ఏఎంసీలకు అప్పగించారు. ఈ ఏడాదికి సంబంధించి అన్ని ట్రేడ్ లైసెన్సులను రివైజ్ చేసి అక్కడ ఉన్న విస్తీర్ణాన్ని బట్టి ఫీజులు వసూలు చేయాలని బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్ట్రిక్ట్​గా ఆదేశాలు జారీ చేశారు. అందులో  భాగంగానే ఈ రెండు స్టూడియోల బాగోతం బయటపడింది.