గణేశ్ ఉత్సవాలపై జీహెచ్ఎంసీ మీటింగ్... దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేస్తామన్న కమిషనర్ కర్ణన్

గణేశ్ ఉత్సవాలపై జీహెచ్ఎంసీ మీటింగ్... దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేస్తామన్న కమిషనర్ కర్ణన్
  • మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి 
  • అడిషనల్​ సీపీ విక్రమ్ సింగ్ మాన్ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్​ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సహకారం అందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరగనున్న గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. ఇప్పటికే  వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేస్తున్నామన్నారు. 

విగ్రహాల ఊరేగింపు జరిగే జాతీయ రహదారుల్లో కూడా ఏమైనా రోడ్ల రిపేర్ ఉంటే చేస్తామన్నారు. ఈసారి గతంలో కంటే ఎక్కువ క్రేన్లు ఉపయోగిస్తామని చెప్పారు. ఉత్సవాలకు బడ్జెట్ సమస్య లేదని,  పనుల కోసం గతంలో కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తామని, ఉత్సవ సమితి సభ్యులకు తెలిపారు. 

మండపాలు క్వాలిటీగా ఏర్పాటు చేయండి 

లా అండ్ ఆర్డర్ అడిషనల్​సీపీ విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. ఈసారి వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్నందున  మండపాల నిర్మాణానికి క్వాలిటీ మెటీరియల్, క్వాలిటీ వైరింగ్​తో సహా నాణ్యమైన లాజిస్టిక్ ఉపయోగించాలని సూచించారు. ఊరేగింపు టైంలో విగ్రహాల ఎత్తు వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అందుకని నిమజ్జనానికి వెళ్లే రూట్​తెలుసుకుని ప్రతిమలను ప్రతిష్ఠించాలని కోరారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలన్నారు. 

పెద్ద మండపాల్లో ముగ్గురికి తగ్గకుండా వలంటీర్ల సేవలను ఉపయోగించుకోవాలని చెప్పారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్, సుభద్ర, హెచ్ఎండీ జాయింట్ కమిషనర్ కోట శ్రీవాత్సవ, సీఈ రత్నాకర్, ఎలక్ట్రికల్ సీఈ  ప్రభాకర్, జోనల్ కమిషనర్ లు అనురాగ్ జయంతి, రవి కిరణ్, వెంకన్న, హేమంత్ సహదేవరావు, అపూర్వ చౌహాన్, హెచ్ఎండీఏ, ఆర్టీసీ, మెట్రో రైల్  ట్రాన్స్‌కో అధికారులు తదితరులు పాల్గొన్నారు.